India Lockdown : జూన్‌ 3వ వారం వరకు లాక్‌డౌన్‌ కొనసాగింపు?

  • Publish Date - April 7, 2020 / 02:41 AM IST

భారతదేశంలో లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ గడువు ముగియడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అందరి చూపు కేంద్రంపై ఉంది. లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? లేదా ? అనేదానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. కానీ చాలా మంది లాక్ డౌన్ కంటిన్యూ చేస్తే బెటర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

జూన్‌ 3వ వారం వరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తేనే మంచిదని. ఆ తర్వాతే లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని రిపోర్టులు సూచిస్తున్నాయి. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు.. జూన్‌ 3వ వారంలో కరోనా భారత్‌లో పీక్‌స్టేజ్‌కు వెళ్తుందని తన రిపోర్ట్‌లో తెలిపింది. కాబట్టి అప్పటి వరకు లాక్‌డౌన్‌ ఎత్తివేయకపోతేనే మంచిదనే సూచన చేసింది.

లాక్‌డౌన్‌ కొనసాగించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని కొంతమంది వెల్లడిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుంది. అన్ని వ్యవస్థలు కుదేలవుతాయి. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశముంది. అయినా ఇవన్నీ ప్రజల ప్రాణాలకంటే ముఖ్యమేమికాదని, ఒక్క ప్రాణం పోయినా మళ్లీ తిరిగి తీసుకొస్తామా అనే ప్రశ్నలు వినిపిస్తున్నయి. 

ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్తే.. కొన్నాళ్లపాటు కష్టపడి గాడిలో పెట్టొచ్చు. కానీ ప్రాణాలు పోతే మాత్రం తీసుకురాలేము. అందుకే పలు సంస్థలు, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కరోనా పూర్తిగా కంట్రోల్‌లోకి వచ్చే వరకు కొనసాగించాలని ఘంటాపథంగా చెబుతున్నారు. మరి దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తెలియాలంటే ఈనెల 14 వరకు ఎదురు చూడాల్సిందే.