ఆర్థిక వృద్ధి మందగమనం…భారత్ కు 2.8లక్షల కోట్ల నష్టం!

కొన్నిరోజులుగా దేశ ఆర్థికవ్యవస్థ పతనం అంచుల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సమయంలో ఓ వార్త ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. భారత ఎకానమీ నెమ్మదించడం వల్ల దేశానికి 2.8లక్షల కోట్ల నష్టం వాటిల్లనున్నట్లు ఓ అంచనా తెలిపింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ యొక్క తాజా అంచనా ప్రకారం… భారతదేశం యొక్క పొటెన్షియల్ జీడీపీ ఏడు శాతానికి చేరుకుంటుంది. అయితే అనేక ఏజెన్సీల అంచనాలు బొటాబొటిగా 5% వృద్ధిని చూపుతున్నాయి.

అంటే ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో లేదా ఏడు శాతంతో పనిచేస్తుంటే, 2020 జీడీపీ సంపూర్ణ సంఖ్యలో రూ .150.63 లక్షల కోట్లు ఉండాలి. అయితే ఐదుశాతం వృద్ధి అంచనా ప్రకారం జీడీపీ సంపూర్ణ సంఖ్యలో రూ.147.81 లక్షల కోట్ల రూపాయల దగ్గర ఉండనుంది. ఇది అదనపు ఆర్థిక కార్యకలాపాల్లో రూ .2.8 లక్షల కోట్ల నష్టానికి దారితీస్తుంది. 2019 ఆర్థికసంవత్సరంలో వాస్తవ జీడీపీ రూ. 140.78 లక్షల కోట్లు.

 భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని ఇటీవల కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 2019-20 రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 4.5 శాతానికి మందగించింది. వినియోగ వస్తువుల ఉత్పత్తి వృద్ధి వాస్తవంగా ఆగిపోయింది. పెట్టుబడి వస్తువుల ఉత్పత్తి పడిపోతోంది. ఎగుమతులు, దిగుమతులు, ప్రభుత్వ ఆదాయాల సూచికలు ప్రతికూల పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయి. ఈ సూచికలు ఆర్థిక వ్యవస్థ దుస్థితిని సూచిస్తున్నాయి. 1991లో తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి దగ్గరగా ఉందని అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు.