మంచి వ్యక్తి అని భారత్ చెబితేనే చోక్సీకి పౌరసత్వం ఇచ్చాం..ఆంటిగ్వా ప్రధాని

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు రూ.13వేల కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మెహుల్ చోక్సీ భారత్ వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. 2018 జనవరిలో చోక్సీ.. ఆంటిగ్వా పౌరసత్వం పొంది అక్కడే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.

అయితే చోక్సీ నిజాయితీ లేని వ్యక్తి అని, అతడిని భారత్ కు  డిపోర్ట్ చేసేందుకు త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని ఆంటిగ్వా  ప్ర‌ధాని గాస్ట‌న్ బ్రౌనే తెలిపారు. ఓ భార‌తీయ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ.. చోక్సీతో త‌మ దేశానికి ఎటువంటి విలువ ఉండ‌ద‌ని, అత‌ని అప్పీళ్లు అన్నీ ముగిసిన త‌ర్వాత‌, ఇండియాకు అప్ప‌గిస్తామ‌ని బ్రౌనే తెలిపారు.  భార‌తీయ అధికారులు ఎప్పుడైనా వ‌చ్చి చోక్సీని విచారించ‌వ‌చ్చు అని ఆయన తెలిపారు.

అయితే  చోక్సీ మంచి వ్యక్తి అని భారతదేశం నుండి వచ్చిన సమాచారం ఆధారంగా అతడికి తాము పౌరసత్వం ఇచ్చామని, తర్వాత అతను నిజాయితీ లేని వ్యక్తి అని తెలిసిందని, చోక్సీ మంచి వ్యక్తి అని భారత అధికారులు క్లియరెన్స్ ఇవ్వడం దురదృష్టకరమని ఆ పరిస్థితికి భారత అధికారులే బాధ్యత తీసుకోవాలని బ్రౌనే అన్నారు. ఏది ఏమైనప్పటికీ చోక్సీ ఒక అవినీతిపరుడని అన్నారు. 

పీఎన్‌బీ స్కామ్‌లో ప్ర‌ధాన నిందితుడు నీర‌వ్ మోడీ మేనమామే ఈ మెహుల్ చోక్సీ. ఇద్ద‌రూ డైమండ్ వ్యాపారం పేరుతో పీఎన్‌బీలో 13వేల500కోట్ల భారీ స్కామ్‌ కు పాల్ప‌డ్డారు. స్కామ్ వెలుగులోకి వచ్చే కొన్ని రోజుల ముందే ఈ ఇద్దరూ దేశం దాటి పారిపోయిన విషయం తెలిసిందే.