బ్రెజిల్‌ను దాటేసి రెండవ స్థానంలోకి భారత్.. ఒక్క రోజులో 90వేలకు పైగా కరోనా కేసులు

  • Publish Date - September 6, 2020 / 10:35 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా.. వైరస్ సోకినవారి పరంగా భారత్ ఇప్పుడు బ్రెజిల్‌ను అధిగమించింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,632మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పుడు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 41 లక్షలు దాటింది. బ్రెజిల్‌లో ప్రస్తుతం 4 మిలియన్ల మంది కరోనా రోగులు ఉన్నారు. ఈ విధంగా భారతదేశం కరోనా విషయంలో ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచింది. అమెరికా మాత్రమే ఇప్పుడు భారతదేశం కంటే ఎక్కువ కేసులు కలిగి ఉంది.

గ‌త వారం రోజులుగా ప్ర‌తిరోజు 80 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌వుతుండగా, ఆ సంఖ్య‌ ల‌క్ష‌వైపు ప‌రుగులు పెడుతుంది. కేవ‌లం 13 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 10 ల‌క్ష‌ల కేసులు దేశంలో న‌మోద‌వ‌గా, నిన్న ఒకేరోజు 90 వేల‌కుపైగా క‌రోనా పాజిటివ్‌ రోగులు నిర్ధార‌ణ అయ్యారు. దీంతో క‌రోనా కేసులు సంఖ్య 41 లక్ష‌ల మార్కును దాటింది.

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 90,632 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, ఇదే సమయంలో 1,065 మంది చనిపోయారు. దేశంలో క‌రోనా కేసులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఒక్కరోజులో ఇన్ని అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. క‌రోనా కేసుల సంఖ్య 41,13,812కు చేరుకోగా.. ఇందులో 8,62,320 మంది బాధితులు ఇంకా చికిత్స పొందుతున్నారు. 31,80,866 మంది కోలుకున్నారు.

గ‌త నెల రెండో వారం నుంచి రోజూ 9 వంద‌ల‌కు పైగా మ‌ర‌ణాలు న‌మోద‌వుతుండ‌టంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య 70,626కు పెరిగాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అయితే కోలుకున్న వ్యక్తుల సంఖ్య చురుకైన కేసుల సంఖ్య కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.

కరోనా వైరస్ కారణంగా 51శాతం మరణాలు 60 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో సంభవించాయి. 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సంక్రమణ నుంచి కోలుకునే రేటు 77 శాతానికి పైగా ఉంది. మొత్తం ఆరోగ్యకరమైన రోగులలో 30 శాతం మహారాష్ట్ర, తమిళనాడు రెండు రాష్ట్రాలకు చెందినవారు.