India Covid 19 Cases
India Covid 19 Cases : దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. కరోనా కొత్త కేసులు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 40వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 39వేల 726కి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 1.15 కోట్లకు చేరాయి. క్రితం రోజు 35వేల 871 కరోనా కేసులు, 172 మరణాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది (2021)లో రోజువారీ కేసుల్లో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం దేశంలో ఇదే తొలిసారి.
గడిచిన 24 గంటల్లో 154మంది కోవిడ్ కు బలయ్యారు. దీంతో దేశంలో కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం లక్షా 59వేల మంది కోవిడ్ తో చనిపోయారు. ఈ మేరకు శుక్రవారం(మార్చి 19,2021) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.
రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులూ పెరిగాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 71వేలకి చేరింది. కాగా, కోటి 10లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 3కోట్ల 71లక్షల(3కోట్ల 71లక్షల 43వేల 255మందికి) మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.
మహారాష్ట్రలో గతేడాది రికార్డ్ బద్దలు:
కాగా, మహారాష్ట్రలో కరోనా కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లో 25వేల 833 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య గతేడాది(2020) రికార్డును చెరిపేసింది. గతేడాది సెప్టెంబర్ 11న ఒక్కరోజు వ్యవధిలో 24వేల 886 కేసులు నమోదవగా, ఆ రికార్డు చెరిగిపోయింది. గడిచిన 24 గంటల్లో 12వేల 764మంది కరోనా నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్ర తర్వాత కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం పంజాబ్. అక్కడ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూని మరో రెండు గంటలు పొడిగించింది ప్రభుత్వం.
తెలంగాణలో కరోనా విజృంభణ:
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 300 దాటింది. నిన్న(మార్చి 18,2021) రాత్రి 8గంటల వరకు 62వేల 972 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న కరోనాతో మరో ఇద్దరు మరణించారు. కరోనా బారి నుంచి 142 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2వేల 434 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 943 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 47 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం(మార్చి 19,2021) ఉదయం బులిటెన్ విడుదల చేసింది.