జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద ఒక్క సెకన్ కూడా ఆగాల్సిన అవసరం లేకుండా చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థ రానుంది. దీని గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరాలు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న విధానాలను తీసేసి, ఏడాదిలోగా భారత్‌లో కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. ముందుగా 10 ప్రాంతాల్లో ఇటువంటి విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.
లోక్‌సభలో ప్రశోత్తరాల వేళ నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. కొత్త విధానం అమల్లోకి రానుందని, వాహనదారులను టోల్‌ప్లాజాల వద్ద ఎవరూ ఆపరని చెప్పారు ఇప్పటివరకు హైవేలపై వాహనదారులు టోల్ చెల్లించేందుకు వాహనాన్ని ఆపాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఆ తర్వాత ఫాస్టాగ్ స్కాన్ అయ్యాక వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తోందని చెప్పారు.
కొత్త విధానం అమల్లోకి వచ్చాక వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, చెల్లింపులు జరుగుతాయని వివరించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ మేరకు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేసింది. కాగా, భారత్‌లో రూ.10 లక్షల కోట్ల విలువైన 4,500 హైవే ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని నితిన్ గడ్కరీ తెలిపారు.