Nimisha Priya: యెమెన్‌లో 16న భారతీయ నర్సుకు ఉరిశిక్ష.. అక్కడ ఆమె చేసిన తప్పేంటి..? శిక్షను ఆపేందుకు భారత్ ప్రయత్నాలు..

యెమెన్‌లో మరణశిక్ష విధించిన భారతీయ నర్సు నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నారు.

Nimisha Priya

Indian Nurse Nimisha Priya: యెమెన్‍‌లో వ్యాపార భాగస్వామి మృతి కేసులో కేరళ నర్సు నిమిషా ప్రియకు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇటీవలే యెమెన్ దేశ అధ్యక్షుడు రషాద్ అల్ అలిమి ఇందుకు ఆమోదం తెలపగా.. జూలై 16న ఆమెకు శిక్ష అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని కేరళలోని నిమిషా ప్రియ కుటుంబ సభ్యులకు అక్కడి జైలు అధికారులు తెలియజేసినట్లు సమాచారం. అయితే, మరణ శిక్ష నుంచి ప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

విదేశీ మంత్రిత్వ శాఖ నిమిషా ప్రియ ఉరిశిక్షను ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, స్థానిక అధికారులు, ఆమె కుటుంబ సభ్యులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని, సాధ్యమైన అన్ని సహాయసహకారాలను అందిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

నిమిషా ప్రియ కేసు గురించి..
కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ నర్సు కోర్సు పూర్తి చేసిన తరువాత 2008లో యెమెన్ వెళ్లింది. అక్కడే ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరింది. 2011లో థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్నిరోజుల తరువాత ఆమె సొంతంగా క్లినిక్ ప్రారంభించాలని భావించింది.

యెమెన్ దేశం నిబంధనల ప్రకారం ఇతర దేశస్తులు అక్కడ వ్యాపారం చేయాలంటే స్థానికుడితో భాగస్వామ్యం కలిగి ఉండాలి. దీంతో 2014లో నిమిషా, థామస్ జంట స్థానిక వ్యక్తి తలాల్ అదిబ్ మహదీని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. కొన్నేళ్ల తరువాత ఆమె భర్త, కుమార్తె కేరళకు వచ్చారు. నిమిషా యెమెన్ లోనే ఉంటూ క్లినిక్ ను కొనసాగించింది. కొన్నాళ్ల తరువాత నిమిషా ప్రియకు వ్యాపార భాగస్వామి అదిబ్ మహదీతో విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె అతనిపై ఫిర్యాదు చేసింది.

ప్రియ ఫిర్యాదుతో 2016లో మహదీ అరెస్ట్ అయ్యాడు. కొన్నాళ్లకు జైలు నుంచి విడుదలై ప్రియను బెదిరించడం మొదలు పెట్టారు. ప్రియను తన భార్యగా పేర్కొంటూ వేధింపులకు గురిచేస్తూ ఆమె పాస్‌పోర్టు లాక్కొన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోపోయే సరికి.. నిమిషా తన పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు మహదీకి మత్తుమందు ఇంజెక్ట్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

అధిక మోతాదులో మత్తు మందు ఇవ్వడంతోనే మరణించాడని అతని కుటుంబ సభ్యలు ఆరోపించారు. ఆ తరువాత నిమిషా దేశం విడిచి పారిపోయే ప్రయత్నంలో ఆమెను పోలీసులు 2018లో అరెస్టు చేసి హత్య కేసులో దోషిగా నిర్దారించారు. ఈ కేసులో ఆమెకు మరణ శిక్ష పడింది. జులై 16న ఆమెను ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఆమెకు క్షమాభిక్ష కోసం భారత విదేశాంగ శాఖ అక్కడి అధికారులు చర్చలు జరుపుతోంది.