వర్క్ ఫ్రం హోమ్ బెటర్ అంటున్న మహిళలు, అటు ఆఫీసు, ఇటు ఇంటి పని పూర్తి

Indian women working : వర్క్ ఫ్రం హోమ్ బెటర్ అంటున్నారు మహిళలు. అటు ఆఫీసు, ఇటు ఇంటి పని పూర్తి చేసుకొనే అవకాశం ఉంటోందంటున్నారు. దీనివల్ల ఎక్కువ సమయం ఆదా అవుతోందని, ఇంటి నుంచే ఆఫీసు పనులు కూడా చక్కపెట్టేస్తామని వెల్లడిస్తున్నారంట. గత సంవత్సరం కరోనా కారణంగా..ఉద్యోగాలపై పెను ప్రభావం చూపెట్టింది. చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యతనిచ్చాయి.

ఉద్యోగులు ఇంటి నుంచే పనులు చేశారు. ఈ క్రమంలో..ఓ సంస్థ సర్వే చేపట్టింది. భారతదేశానికి చెందిన మహిళలు ఇంటి నుంచే పని చేస్తే బెటర్ అని వెల్లడించారంట. ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో 19 దేశాలకు చెందిన 13 వేల మంది పాల్గొన్నారు. ఇందులో 500 మంది భారతీయులున్నారు. ఐటీ రంగానికి చెందిన మహిళల్లో 38 శాతం మంది వర్క్ ఫ్రం హోమ్ బెటర్ అనే దానికే మొగ్గు చూపుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.

గత సంవత్సరం నవంబర్ – డిసెంబర్ కాలంలో సైబర్ సెక్యూర్టీ సంస్థ కాస్పర్ స్కీ ప్రపంచ వ్యాప్తంగా..టెక్నాలజీ, ఐటీ సంస్థల్లో పని చేసే పురుషులు, మహిళల అభిప్రాయాలు సేకరించి..సర్వే చేసింది. ఆఫీస్ పని చేస్తూనే..ఇంటి పని పూర్తి చేసుకుంటున్నట్లు 33 శాతం మంది పురుషులు, 54 శాతం మహిళలు వెల్లడించినట్లు సంస్థ పేర్కొంటోంది. 40 శాతం మంది పురుషులతో పోలిస్తే..54 శాతం మంది మహిళలకు పిల్లలకు చదువు చెప్పాల్సిన బాధ్యత ఉందని, కుటుంబాన్ని కూడా చూసుకోవాల్సి రావడంతో..మహిళలు వర్కింగ్స్ టైమింగ్స్ మార్చుకుంటున్నారని వెల్లడించారు.