Childrens Health
Childrens Health : పిల్లలు చురుగ్గా ఉండేందుకు తల్లిదండ్రులు అనేక చిట్కాలు పాటిస్తూ ఉంటారు. పెరిగే కొద్దీ వాళ్లు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, దేశంలోని ప్రతి ఎనిమిది మంది పిల్లల్లో ఒకరి మెదడు ఎదుగుదల సరిగ్గా లేదని సర్వేలు చెబుతున్నాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే.. పిల్లల్లో చురుకైన మెదడు కోసం పాత కాలం పద్దతులే బెస్ట్ అంటూ ఓ ఇంటర్నేషనల్ స్టడీ తేల్చింది.
పిల్లల సంరక్షణలో అమ్మమ్మల కాలం నుంచి అనాదిగా వస్తున్న పాత పాద్దతులే నూటికి నూరుపాళ్లు కరెక్ట్ అని స్టడీ తేల్చింది. బిడ్డ పుట్టిన మొదటి వెయ్యి రోజులు వాళ్ల ఎదుగుదలకు మన పాత పద్దతులే అద్భుతంగా పని చేస్తాయని ఈ పరిశోధకులు స్పష్టం చేశారు.
నూనెతో మాలిష్ చేయడం, నలుగు పెట్టడం, ఊయలలో వేసి ఊపడం, జోలపాడడం, బోర్లా పడుకోబెట్టడం, చేతితో తినిపించడం వెనుక సైన్స్ ఉందని బ్రిటీష్ మెడికల్ జర్నరల్ (జీఎంజే) పీడియాట్రిక్స్ ఓపెన్ స్టడీ పేర్కొంది.
తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. తెలంగాణ నుంచి 11 మంది పాల్గొన్నారు. నువ్వుల నూనెతో మాలిష్ చేయడం, సున్నిపిండితో నలుగు పెట్టడం, ఉయ్యాలలో లాలిపాటలతో నిద్రపుచ్చడం లాంటివి మన దగ్గర ఎక్కువగా ఉన్నాయని, ఇవే పిల్లలను ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతాయని స్టడీ తెలిపింది.
♦ స్టడీ ప్రకారం.. అప్పుడే పుట్టిన పసికందు నుంచి మూడు నెలలప్పుడు నూనెలతో మాలిష్ చేసి, కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి.
♦ 4 నుంచి 6 నెలలప్పుడు బోర్లా పడుకోబెట్టి, పాటలు పాడుతూ ఆడించాలి. 7 నుంచి తొమ్మిది నెలలప్పుడు చేతి వేళ్లతో మొత్తటి ఆహారం తినిపిస్తూ, దాగుడుమూతలు ఆడాలి.
♦ 10 నుంచి 12 నెలలప్పుడు పాకడానికి, నిలబడటానికి సాయం చేస్తూ, ఇంట్లో వస్తువులతో ఆడుకోనివ్వాలి.
♦ ఈ సింపుల్ పనులే పిల్లల ఎదుగుదలకు గట్టి పునాది వేస్తాయని స్టడీ తేల్చింది.
♦ మొత్తం మీద మన అమ్మమ్మల పెంపకం మూఢనమ్మకం కాదు.. దాని వెనుక పక్కా సైన్స్ ఉందని ఈ స్టడీ తేల్చింది. అయితే, మన సంప్రదాయ జ్ఞానానికి, ఆధునిక వైద్యాన్ని జోడిస్తేనే పిల్లల భవిష్యత్తుకు తిరుగుండదని నిపుణులు పేర్కొంటున్నారు.