ఐఎన్ఎక్స్ మీడియా, మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి ఢిల్లీ కోర్టు జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. నవంబర్ 13 వరకు తీహార్ జైల్లోనే ఉండాలని ఆదేశించింది. ఈ కేసు విషయంలో చిదంబరాన్ని ఒక రోజు కస్టోడియల్ విచారణ కోరుతూ ఈడీ వేసిన పిటిషన్ ను స్పెషల్ జడ్జీ అజయ్ కుహార్ తోసిపుచ్చారు. ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని చిదంబరానికి తీహార్ జైల్లో ఇంటి భోజనానికి అనుమతించే అవకాశాన్ని కల్పించినట్టు కోర్టు తెలిపింది.
అంతేకాదు.. ఆయనకు మందులు, వెస్టరన్ టాయిలెట్, సెక్యూరిటీ, సపరేట్ సెల్ సౌకర్యాలు అందించేలా జైలు అధికారులకు కోర్టు సూచించింది. ఐఎన్ఎక్స్ కేసులో 74ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నేతను ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ అక్టోబర్ 24న కోర్టు ఆదేశించింది. ఈడీ కస్టడీ నేటితో పూర్తి కావడంతో మరో రోజు చిదంబరాన్ని కస్టడీ కోరుతూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈడీ తరపున కోర్టులో వాదించారు.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ చిదంబరం తరపున కోర్టులో వాదించారు. మరోవైపు చిదంబరం తన ఆరోగ్యం దృష్ట్యా ఆరు రోజులు తాత్కాలిక ఉపశమనం కావాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ లోని ఏసియన్ ఇన్స్ స్టట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (AIG) రెగ్యులర్ డాక్టర్ ను సంప్రదించి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని కోర్టును అభ్యర్థించారు.
అక్టోబర్ 5 నుంచి పొత్తికడుపులో నొప్పి వస్తుండటంతో తనకు అత్యవసర వైద్య చికిత్స అవసరం ఉందని కోర్టుకు విన్నవించారు. చిదబరం దాఖలు చేసిన తాత్కాలిక రిలీఫ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉండగా, ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో చిదంబరాన్ని సీబీఐ ఆగస్టు 21న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం చిదంబరం ఈడీ కస్టడీలో ఉన్నారు.