INSAT 3DS satellite on GSLV F14
జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగం విజయవంతమైంది. వాతావరణాన్ని అంచనా వేయడంతో పాటు విపత్తు నిర్వహణకు సేవలు వాడుకోవడం వంటి వాటి కోసం ఇస్రో ఇన్‌శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. మన ఉపగ్రహాల ద్వారా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు అవకాశం దక్కింది. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఆధ్వర్యంలో రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు జరిగాయి.
ఏపీలోని శ్రీహరికోట భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 27.5 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగింది. కాగా, జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం. ఈ రాకెట్ 19 నిమిషాల్లో నిర్ణీత అంతరిక్ష కక్ష్యకు చేరేలా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు. అనుకున్న ప్రకారమే ఉపగ్రహం అన్ని దశలను దాటుకుంటూ నిర్ణీత సమయానికి విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. ఈ ఉపగ్రహ బరువు 2,275 కిలోలు.
చెంగాళమ్మకు ఇస్రో చైర్మన్ పూజలు
జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగానికి ముందు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ పూజలు చేశారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకున్నారు. ఇస్రో చైర్మన్‌కు ఆలయ ట్రస్ట్ సభ్యులు ముప్పాళ్ల చంద్ర శేఖర్ రెడ్డి ప్రసాదం అందజేశారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. భారత వాతావరణ శాఖ ప్రయోజనాల కోసం ఇన్ శాట్ 3 DS ఉపగ్రహం ప్రయోగిస్తున్నట్లు తెలిపారు.