SSLV-D2 Mission Successful: ప్రయోగం విజయవంతం.. నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2

ఎస్ఎస్ఎల్‌వీ-2 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ నుంచి శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

SSLV-D2 Mission Successful: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉదయం 9.18 గంటలకు అతి చిన్న రాకెట్ ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2ని విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన ఈ రాకెట్‌ ద్వారా రెండు దేశీయ, ఒక అమెరికాకు చెందిన ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపించింది. శుక్రవారం తెల్లవారు జామున 2.48 గంటలకు ఈ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైన విషయం విధితమే. 6.30 గంటలు పూర్తయిన తరువాత ముందుగా నిర్ధేశించుకున్న సమయం సరిగ్గా 9.18గంటలకు రాకెట్ నింగిలోకి ఎగిరింది.

SSLV-D2: నింగిలోకి దూసుకెళ్లనున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ -డీ2.. ప్రయోగానికి సర్వం సిద్ధం

ఇస్రోకు చెందిన 156.3కిలోల బరువు కలిగిన ఈవోఎస్-07 ఉపగ్రహంతో పాటు యూఎస్ఏ అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూసమీప కక్ష్యలో ప్రవేశపెట్టారు. 450 కిలో మీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్-07, అదేవిధంగా 880 సెకన్ల వ్యవధిలో జానుస్-1ను, 900 సెకన్లకు ఆజాదీశాట్ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇదిలాఉంటే ప్రయోగం విజయవంతం కావటంతో మూడు ఉపగ్రహాల బృందాలను ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ అభినందించారు.

 

గత ఏడాది ఆగస్టు 9న ఎస్ఎస్ఎల్‌వీ తొలి టెస్ట్ ప్రయోగం విఫలమైంది. ఇస్రో ప్రకారం.. వైఫల్యంపై దర్యాప్తులో రెండవ దశను వేరుచేసే సమయంలో ఎక్విప్‌మెంట్ బే(ఈబీ) డేక్‌పై స్వల్ప వ్యవధిలో వైబ్రేషన్ సమస్య తలెత్తిందని గుర్తించారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు లేకుండా విజయవంతంగా నింగిలోకి ఎస్ఎస్ఎల్‌వీ-2 ను ఇస్రో నింగిలోకి పంపించింది.

ట్రెండింగ్ వార్తలు