చెన్నై: మొదటి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నవేళ తమిళనాడులో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తమిళనాడు లోని వేలూరు జిల్లా కాట్పాడిలో ఐటీ అధికారులు సోదాలు జరిపి ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. డీఎంకే కోశాధికారి దురై మురుగన్ కు చెందిన కళాశాల, సిమెంట్ ఫ్యాక్టరీల్లో సోమవారం ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సిమెంట్ ఫ్యాక్టరీ గోడౌన్ లో సోదాలు నిర్వహించగా అట్టపెట్టెల్లో దాచి ఉంచిన సుమారు రూ.20 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.
డీఎంకే కోశాధికారి దురై మురుగన్ కుమారుడు కదిర్ ఆనంద్ చెన్నై సౌత్ పార్లమెంట్ స్ధానం నుంచి డీఎంకే అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. ఈ నగదును ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు దాచి పెట్టి ఉంటారని భావించిన అధికారులు కేసు నమోదు చేసి, నగదును రిజర్వ్ బ్యాంకుకు తరలించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, ఐటీ,ఈడీ,సీబీఐ తో దాడులు చేయిస్తోందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సుమారు వంద కోట్లు వ్యానులో తరలిస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.