జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు నిర్ణయం అల్లా నిర్ణయం కాదని ఆమె అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆశలు వదులుకోవద్దని కూడా ఆమె కోరారు.
మెహబూబా ముఫ్తీ ఆదివారం (డిసెంబర్ 17) కుప్వారాలో విలేకరులతో మాట్లాడుతూ, ‘‘మేము ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. మా పోరాటం కొనసాగిస్తాం. సుప్రీంకోర్టు అల్లా ఏం కాదు. రాజ్యాంగ పరిషత్ సిఫారసు లేకుండా ఆర్టికల్ 370ని సవరించలేమని గతంలో ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. దేవుడి నిర్ణయమని మేము అనుకోవడం లేదు’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: అధికారం నుంచి ముస్లింలు ఔట్.. కేంద్రం సహా 15 రాష్ట్రాల్లో ముస్లిం మంత్రులే లేరు, కాంగ్రెస్ పాలిత 2 రాష్ట్రాల్లో జీరో
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఓటమిని అంగీకరించాలని కోరుకుంటున్నారని, అయితే తమ చివరి శ్వాస వరకు పోరాటం కొనసాగిస్తామని పీడీపీ చీఫ్ అన్నారు. ఎంతో త్యాగం చేశామని, దాన్ని వృథాగా వదిలేయలేమని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన 22 పిటిషన్లపై డిసెంబర్ 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తన నిర్ణయంలో ఆర్టికల్ 370 రద్దును సమర్థించింది. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన అని, దానిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని కోర్టు పేర్కొంది. దీనితో పాటు, జమ్మూ కాశ్మీర్‌కు త్వరలో పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని, 2024 సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.