ముఖ్యమంత్రి  OSD  ఇంట్లో ఐటీ సోదాలు

  • Publish Date - April 7, 2019 / 04:42 AM IST

ఇండోర్: దేశవ్యాప్తంగా మరో కొద్ది రోజుల్లో తొలి విడత పోలింగ్ జరుగుతున్న సమయంలో,  ఆదాయపన్ను శాఖ ప్రముఖుల ఇళ్లపై  దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల తమిళనాడులో డీఎంకే పార్టీ కోశాధికారి ఇంట్లో సోదాలు జరపగా తాజాగా ఆదివారంనాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ కు అత్యంత సన్నిహితుల నివాసాల్లో దాడులు జరుపుతున్నారు. సీఎం  ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD) ప్రవీణ్ కక్కర్, ఆర్కే మిగ్లానీ ఇళ్లలో  ఐటీ అధికారులు  సోదాలు జరుపుతున్నారు. ఆదివారం తెల్లవారుఝూమున 3 గంటల సమయంలో 15 మంది ఆదాయపన్ను శాఖ అధికారులు కక్కర్ ఇంటికి చేరుకుని  సోదాలు నిర్వహిస్తున్నారు.

కక్కర్, మిగ్లానీ నివాసాలతో పాటు, ఢిల్లీ లోని సీఎం ఎడ్వైజర్ రాజేంద్ర కుమార్ ఇంట్లో కూడా  ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరిపి  9 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. భోపాల్, ఢిల్లీలలో కమల్ నాధ్ ఆయన సన్నిహితులకు చెందిన మరో 6 ప్రాంతాల్లో కూడా ఏక కాలంలో సోదాలు  జరుగుతున్నట్లు తెలుస్తోంది.  ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులను  లక్ష్యంగా చేసుకుని బీజీపీ అధికారులతో దాడులు చేయిస్తూ…అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. సోదాలు కొనసాగుతున్నాయి.