ITBPలోని 90 వేల మంది చైనాలో ఎక్కువగా మాట్లాడే మాండరిన్ భాష నేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ప్రత్యేక కోర్సును కూడా సిద్ధం చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను అనుసరించి ఐటీబీపీ ఈ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముస్సోరీలోని ఐటీబీపీ శిక్షణా అకాడమీలో మాండరిన్ కోర్సును సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా ఎల్ఏసీలో భారతీయ సైనికులు చైనా జవాన్లతో మాట్లాడటానికి, వారి పత్రాలను చదవడానికి, వారికి జవాబు వ్రాయడానికి వీలుగా అధునాతన కోర్సు సిద్ధం చేస్తున్నారు.
లడఖ్‌లోని భారత, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణను దృష్టిలో ఉంచుకుని.. ఐటీబీపీ తమ జవాన్ల కోసం మాండరిన్ కోర్సును సిద్ధం చేస్తున్నది. ఈ కోర్సు మొత్తం 90 వేల మందికి నేర్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం మన సైనికులు విషయాన్ని వివరించడానికి రాసి వుంచిన పోస్టర్లను ఉపయోగిస్తున్నారు.
ఒకవేళ మన జవాన్లు మాండరిన్ భాష నేర్చుకున్నట్లయితే.. వారితో నేరుగా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారు చేపట్టే కార్యక్రమాలను, వారి ఆదేశాలను, సూచనలను విని అర్థం చేసుకునే వాటికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకునే వీలుంటుంది.
అయితే, మాండరిన్ భాష నేర్చుకోవడం వల్ల పరస్పర సంభాషణ హాట్ టాక్ గా మారే అవకాశాలతోపాటు తరుచూ గొడవపడే పరిస్థితులు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.కాగా,ఇప్పటికే ఎల్‌ఏసీ వద్ద విధుల్లో ఉన్న ఐటీబీపీ జవాన్లకు మాండరిన్ భాష కొద్దిగా తెలుసు. చిన్నచిన్న పదాలు, వాటి అర్థాలు మన జవాన్లకు తెలుసు. అయితే పూర్తిగా చైనా సైనికులతో మాట్లాడేలా కోర్సును సిద్ధం చేస్తున్నారు. ప్రతీ ఐటీబీసీ జవాన్ చైనా మాండరిన్ భాషలో మాట్లాడేలా తీర్చిదిద్దనున్నారు.