ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 90రోజులుగా జైల్లో ఉంటున్న చిదంబరం వేసిన బెయిల్ పిటిషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.చిదంబరం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ బెయిల్ పిటిషన్ సుప్రీంలో దాఖలు చేశారు.
47వ (సీజేఐ)భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన శరద్ అరవింద్ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు జడ్జీల ధర్మాసనం ఈ పిటిషన్ పై త్వరలో విచారించున్నట్టు సిబాల్ చెప్పారు. గతవారం హైకోర్టు చిదంబరం బెయిల్ పిటిషన్ తిరస్కరించిందని, ‘90రోజులుగా జైల్లోనే ఉన్నారని సిబాల్ కోర్టుకు విన్నవించారు. ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించి బెయిల్ ఇప్పించాలని జస్టీస్ బీఆర్ గవాయి, సూర్య కాంత్ తో కూడిన ధర్మాసనాన్ని సిబాల్ అభ్యర్థించారు. దీనిపై సీజేఐ బోబ్డే స్పందించారు. రేపు లేదా ఎల్లుండీ ఈ కేసుపై విచారిస్తామని చెప్పారు.
74ఏళ్ల చిదంబరం వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు జస్టిస్ సురేశ్ కైత్ గతవారమే తిరస్కించారు. ఇలాంటి కేసులో చిదంబరానికి బెయిల్ ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని ఉద్దేశంతో ఆయన బెయిల్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. ఆగస్టు 21న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అధికారులు ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సీబీఐ కేసులో అక్టోబర్ 22న చిదంబరానికి బెయిల్ మంజూరు అయింది. అదే సమయంలో మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేశారు.