ఘనంగా జల్లికట్టు పోటీలు ప్రారంభం

తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకొని తమిళనాడులో ప్రతి యేటా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. మదురై జిల్లాలోని అవనియాపురంలో 700 ఎద్దులు,730మంది బుల్ క్చాచర్ప్(ఎద్దులను పట్టుకునేవాళ్లు) పోటీలు ప్రారంభమయ్యాయి. పలమేడులో 650 ఎద్దులతో జల్లికట్టు పోటీలు ప్రారంభించారు. ఎవరైనా జల్లికట్టులో గాయపడితే వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించేందుకు ముందుజాగ్రత్తగా జల్లికట్టు పోటీలు జరుగుతున్న ప్రదేశంలో అందుబాటులో అంబులెన్స్‌లు సిద్దంగా ఉంచబడ్డాయి.

జల్లికట్టు పోటీలు చాలా భయంకరంగా సాగుతాయన్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా వదిలిన బలమైన ఎడ్లను.. పోటీలో పాల్గొనే వారు వాటి కొమ్ములను పట్టుకొని లొంగదీసుకోవాలి. ఈ సమయంలో చాలా మంది గాయాలపాలవుతారు. కొన్ని సందర్భాల్లో చనిపోయిన ఘటనలూ కూడా ఉన్నాయి. ఈ ప్రమాదకర ఆటలకు స్వస్తి చెప్పాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించినా.. జల్లికట్టు తమ సంస్కృతిలో భాగమని తమిళులంతా ఏకమై.. తీవ్ర ఆందోళనలు చేశారు. ప్రజలకు సినీతారలు, రాజకీయ నాయకులు సైతం మద్దతు తెలిపారు.

దీంతో సుప్రీంకోర్టు తమ ఆదేశాన్ని కొన్ని షరతులతో ఉపసంహరించుకుంది. మరోవైపు రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి నేతృత్వంలోని పర్యవేక్షణ కమిటీల పర్యవేక్షణలో జల్లికట్టును తమిళనాడులోని వివిధ జిల్లాల్లో నిర్వహించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను బుధవారం(జనవరి-15,2020) సుప్రీంకోర్టు కొట్టివేసింది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జల్లికట్టు నిర్వహించబడాలని ఏకే కన్నన్ అనే రైతు ఆ పిటిషన్ దాఖలు చేశాడు.