Jammu and Kashmir : నిరసనలు చేస్తే జీతాలివ్వం..కశ్మీరీ పండిట్లకు గవర్నర్ హెచ్చరిక..

పనిలేదు..జీతం లేదు..అంటూ కశ్మీర్ పండిట్లపై గవర్నర్ ఎల్జీ మనోజ్‌ సిన్హా అసహనం వ్యక్తంచేశారు. నిరసనలు తెలిపేవారికి జీతాలు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు.

Jammu and Kashmir Governor Manoj Sinha to protesting Kashmiri Pandits warning

Jammu and Kashmir : పనిలేదు..జీతం లేదు..అంటూ కశ్మీర్ పండిట్లపై గవర్నర్ ఎల్జీ మనోజ్‌ సిన్హా అసహనం వ్యక్తంచేశారు. నిరసనలు తెలిపేవారికి జీతాలు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు. కశ్మీర్ ప్రాంతం పండిట్ల హత్యలతో వణుకుతోంది. ఉగ్రవాదులు సామాన్య పౌరులను ముఖ్యంగా కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుని మారణహోమం సృష్టిస్తున్నారు. ఇప్పటికే 150మందికిపైగా కశ్మీర్ పండిట్లు హత్యకు గురయ్యారు. దీంతో ఇప్పటికే చాలావరకు పండిట్ల కుటుంబాలు కశ్మీర్ ను వదిలి వలసపోతున్నాయి.

ఈక్రమంలో కశ్మీర్ పండిట్ల వరుస హత్యలతో హడలిపోతున్న పండిట్ల కుటుంబాలు తమను కశ్మీర్ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని..లేదంటే ఉద్యోగాలకు రాజీనామా చేస్తామని లేదంటే లాంగ్ లీవులు పెడతామంటూ నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనలపై గవర్నర్ ఎల్జీ మనోజ్‌ సిన్హా పండిట్లకు హెచ్చరికలు చేశారు. అలా వేలాదిమంది కశ్మీర్ పండిట్లకు చెందిన ఉద్యోగులు నిరసనలకు దిగారు. దీంతో గవర్నర్ వారిని విధులకు హాజరుకావాలని నిరసనలు చేసేవారికి వేతనాలు ఇచ్చేది లేదని హెచ్చరించారు. బుధవారం (డిసెంబర్ 21,2022) మీడియాతో మాట్లాడుతూ ‘కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా జరుగుతున్న హత్యల గురించి ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోందని..ఈ విషయాన్ని పండిట్లు గుర్తించాలని కోరారు. ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవట్లేదని వారు భావించవద్దని కాబట్టి నిరసనలు చేసే పండిట్లు ఇకనైనా మానుకోవాలని కోరారు. నిరసనలు మాని వెంటనే విధులకు హాజరుకావాలని నిరసనల పేరుతో విధులకు హాజరుకాకుండా ఇంటికే పరిమితమైనే వారికి జీతాలు ఇవ్వం’ అని స్పష్టంచేశారు.

కాగా లోయ ప్రాంతం నుంచి తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలంటూ కశ్మీరీ పండిట్లు కొద్ది నెలల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగులు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయి ‘బ్రీతింగ్ పీరియడ్’ గా జీతాలు ఇవ్వాలని కోరారు. దీంతో గవర్నమెంట్ వారికి 2021 ఆగస్టు వరకు జీతాలు ఇచ్చింది. అయినా వారు తిరిగి విధులకు హాజరుకాకపోవటంతో ఇలా పనిచేయకుండా ఇంట్లో కూర్చునేవారికి..నిరసనలు చేసేవారికి జీతాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు గవర్నర్ ఎల్జీ మనోజ్‌ సిన్హా.