పోలీసుల ప్రకటన : ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ.30 లక్షల రివార్డు

  • Publish Date - October 28, 2019 / 10:22 AM IST

ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. హిజ్‌బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ.30 లక్షల రివార్డు అందజేస్తామని జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. మొహమ్మద్ అమిన్ అలియాస్ ‘జహంగీర్ సరూరి’, అతని ఇద్దరి సహచరులు-రియాజ్ అహ్మద్, ముదస్సిర్ అహ్మద్‌లపై ఈ రివార్డును పోలీసులు ప్రకటించారు. 

అమిన్‌ తలపై రూ.15 లక్షలు, రియాజ్, ముదస్సిర్ తలలకు చెరో రూ.7.5 లక్షలు ఇస్తామని ఆ ప్రకటన ప్రకటించింది.  ఈ  ముగ్గురు ఉగ్రవాదుల ఫోటోలున్న పోస్టర్లను కిస్త్‌వార్, సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీరి ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలనీ..సమాచారం ఇచ్చిన వారి పేర్లను వివరాలను రహస్యంగా ఉంచుతామని వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సమాచారం తెలియచేసేందుకు రెండు ఫోన్ నెంబర్లను కూడా పోస్టర్లలో ప్రింట్ చేయించారు. 

దీనిపై కిస్త్‌వార్ సీనియర్ పోలీస్ సూపరింటెండెండ్ హర్మీత్ సింగ్ మాట్లాడుతూ…కొండ ప్రాంతమైన జిల్లా అయిన కిస్త్‌వార్‌లో ప్రజలు గుర్తించటానికి వీలుగా ఉండేందుకు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.