వదిలేయండి…రాజకీయాలు చేయోద్దన్న జేఎన్ యూ వైస్ ఛాన్సలర్

జేఎన్‌యూలో ఇటీవల చోటుచేసుకున్న హింసాకాండ, ఆ తర్వాత పలువురుప్రముఖులు యూనివర్విటీకి వెళ్లి విద్యార్థులను పరామర్శించడం వంటి విషయాలపై జేఎన్ యూ వైస్ ఛాన్సలర్ ఎమ్ జగదీష్ కుమార్ స్పందించారు. బాలీవుడ్ నటి దీపికా పడకొనే, డీఎంకే నేత కణిమొళి జేఎన్‌యూకు రావడం, కాంగ్రెస్ సైతం వర్శిటీలో హింసాకాండపై నిజ నిర్ధారణ కమిటీని పంపించాలనుకున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఎం.జగదీష్ కుమార్ మాట్లాడుతూ…దయచేసి మా యూనివర్శిటీని రాజకీయం చేయకండి. మమ్మల్నిలా వదిలేయండి…మా పని మమ్మల్ని చేసుకోనీయండి అని అన్ని రాజకీయ పార్టీలను ఆయన కోరారు.
 
వర్శిటీలో హింసాకాండ నేపథ్యంలో పలువురు ప్రముఖులు వర్శిటీని సందర్శిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ…ఆందోళనకు దిగిన విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వస్తున్న ప్రముఖలందరినీ తాను ఒకటే అడగదలచుకున్నానని, రీసెర్చ్ చేసేందుకు, టీచింగ్ కోసం వచ్చిన వేలాది మంది విద్యార్థుల హక్కులను వారి నుంచి దూరం చేయవద్దని, వారికి ఎందుకు బాసటగా నిలబడటం లేదని సూటిగా ప్రశ్నించారు.

క్యాంపస్‌లో యథాపూర్వ పరిస్థితికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విద్యార్థులు జరిగినదంతా మరిచిపోయి క్యాంపస్‌లకు తిరిగి రావాలని ఆయన కోరారు. ఫీజుల పెంపు చర్యపై నెలరోజులుగా విద్యార్థులు కొనసాగిస్తున్న నిరసనలపై కూడా మాట్లాడుతూ…పేద విద్యార్థులకు సాయపడేందుకు వీలుగా నిధి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వర్శిటీ పూర్వవిద్యార్థులను సైతం తాము సంప్రదిస్తున్నట్టు తెలిపారు.