Nation Strike Hallmarking
Nation Strike : బంగారు నగలపై హాల్ మార్కింగ్ ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 23న దేశవ్యాప్తంగా ఉన్న జువెలరీ వ్యాపారులు ‘సమ్మె’కు దిగనున్నారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజెసి) తెలిపింది. ఈ సమ్మెకు జెమ్స్ & జువెలరీ పరిశ్రమలోని నాలుగు జోన్లకు చెందిన 350 సంఘాలు మద్దతిచ్చినట్లు జీజెసీ చెప్పింది.
బంగారు ఆభరణాలపై హాల్ మార్కింగ్ “ఏకపక్షంగా అమలు” చేయడాన్ని జువెలరీ వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జూన్ 16 నుంచి దశలవారీగా బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేస్తూ వచ్చింది కేంద్రం. ఫేజ్-1 కింద 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాలో హాల్ మార్క్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం చెప్పింది.
గోల్డ్ హాల్ మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే ఒక లోగో. హాల్‌మార్కింగ్ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కొన్ని ప్రమాణాలు పెట్టింది. ఈ ప్రమాణాలను ప్రతి వ్యాపారి పాటించాల్సి ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోవద్దని కేంద్రం బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది.
కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ప్రకారం వ్యాపారులు హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలను విక్రయించరాదు. ఒకవేళ విక్రయిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. అయితే ఈ కొత్త విధానంపై వ్యాపారుల నుంచి బీఐఎస్కు అనేక ఫిర్యాదులు అందాయి.
హాల్‌మార్కింగ్ అంటే?
హాల్‌మార్కింగ్ అనేది బంగారం వంటి లోహాల స్వచ్ఛతను ధ్రువీకరిస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దీన్ని పర్యవేక్షిస్తుంది. ఆభరణాలపై హాల్‌మార్కింగ్ ఉంటే అది స్వచ్ఛమైన బంగారమని అర్థం చేసుకోవాలి. 2000 సంవత్సరం నుంచి దేశంలో హాల్‌మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ఇప్పటివరకు 40 శాతానికి పైగా బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ ఉందని అంచనా.