గెయింట్ కిల్లర్…బీజేపీ సీఎంను ఓడించిన స్వతంత్ర అభ్యర్థి

ఇవాళ విడుదలైన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి బీజేపీ  షాక్ కు గురైందనే చెప్పవచ్చు. సాక్ష్యాత్తూ జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ ఓటమిపాలయ్యారు. జార్ఖండ్ లో జెంషెడ్‌పూర్‌ ఈస్ట్‌ చాలా కీలకమైన నియోజకవర్గం. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సీటు కోసం భారీ ప్రచారం జరిగింది. సీఎం రఘుబర్‌ దాస్‌ ఆ స్థానం నుంచే పోటీ చేశారు. కానీ ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి సరయూ రాయ్ చేతిలో ఓడిపోయారు. 

సరయూ రాయ్‌కి గెయింట్‌ కిల్లర్‌గా గుర్తింపు ఉంది. మాజీ బీజేపీ నేత అయిన సరయూ…ఇప్పుడు ఆ పార్టీ ఓటమికి కారణమయ్యారు. గతంలో ఇద్దరు సీఎంలను ఇంటి దారి పట్టించిన సరయూ.. ఈసారి బీజేపీకి కూడా జలక్‌ ఇచ్చారు. ఈ సారి ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన సీఎంపైనే ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. రఘుబర్‌ తనను అడ్డుకున్నారు కాబట్టి, ఆయన మీదే పోటీ చేస్తానని సరయూ సవాల్‌ చేసి..చెప్పినట్లుగానే విక్టరీ కొట్టారు. గతంలో జెంషెడ్‌పూర్‌ వెస్ట్‌ నుంచి పోటీ చేసిన‌ సరయూ…ఈసారి జెంషెడ్‌పూర్‌ ఈస్ట్‌ నుంచి సీఎంపైనే పొటీకి దిగి విజయం సాధించి తన సత్తా చూపించారు. 

గత అయిదేళ్ల పాలనలో సీఎం రఘుబర్‌ తీవ్ర అవినీతికి పాల్పడినట్లు సరయూ ఆరోపించారు. అయితే ఎప్పుడైతే సరయూ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పేరు ప్రకటించారో, అప్పుడే హేమంత్‌ సోరెన్‌ ఆయనకు మద్దతు పలికారు. 1996లో సరయూ రాసిన లేఖ వల్ల అప్పటి బీహార్‌ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై అవినీతి విచారణ జరిగింది. దాంతో లాలూ తన పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఇక జార్ఖండ్‌లో మధుకోడా ప్రభుత్వం కూల్చివేతలోనూ సరయూ కీలక పాత్ర పోషించారు. మధుకొడాపై అక్రమ మైనింగ్‌ ఆరోపణలు చేశారు. పారా టీచర్ల నియామకం, అంగన్‌వాడీ కార్మికుల సమస్యలను రఘుబర్‌ హ్యాండిల్‌ చేసిన తీరు పట్ల ప్ర‌జ‌లు అసహనంతో ఉన్న‌ట్లు స‌ర‌యూ ఆరోపించారు. 

ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ…జార్ఖండ్ లో 47స్థానాలను జేఎంఎం-కాంగ్రెస్ కూటమి దక్కించుకుని ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవ్వగా, బీజేపీ 25సీట్లు దక్కించుకుంది.సీఎం పదవికి రాజీనామా చేసేందుకు రఘుబర్ దాస్ రెడీ అయ్యాడు.