నడిరోడ్డుపై యువతి జుట్టు పట్టుకుని లాగి, చెంపపై కొట్టిన పోలీసు

  • Publish Date - July 29, 2020 / 02:47 PM IST

కొంతమంది పోలీసులు అధికారాన్ని అడ్డంపెట్టుకుని దౌర్జన్యాలకు దిగుతుంటారు. అమాయకులపై తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. జార్ఖండ్‌లో ఓ పోలీసు నడిరోడ్డుపై ఓ యువతి చెంపలు వాయించాడు. అంతేకాదు ఆమె జట్టు పట్టుకొని గుంజుతూ అసభ్య పదజాలంతో దూషించాడు. యువతితో అతను వ్యవహరించిన తీరు..సీఎం హేమంత్ సోరెన్ దృష్టికి వెళ్లటంతో ఉన్నతాధికారులు అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు.



సాహిబ్ గంజ్ ప్రాంతంలో ఓ పోలీసు లాక్‌డౌన్ డ్యూటీ చేస్తున్నాడు.ఆ సమయంలో ఓ దళిత యువతి అటువైపు వచ్చింది. ఆమెను చూసిన సదరు పోలీసు వెంటనే ఆపాడు. ఎక్కడికెళ్తున్నావ్..బైటకు ఎందుకు వచ్చావ్ అంటూ ప్రశ్నించాడు. ఆమె సమాధానం చెప్పేలోగా..లాగిపెట్టి ఆమె చెంపపై కొట్టాడు. అక్కడితో ఆగలేదు ఆ పోలీసులు కర్కశత్వం..ఆగ్రహంతో ఊగిపోతూ..ఆమె జట్టుపట్టుకొని అటూ ఇటూ గుంజాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో అది వైరల్ అయ్యింది.

ఆ వీడియో చూసిన వారంతా ఆ పోలీసులు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. పోలీసులు అమాయకులపైనే ఇలా చేస్తుంటారు..పెద్ద వాళ్ల ముందు సెల్యూట్లు చేస్తుంటారు అంటూ ఏకిపడేశారు. ఇటువంటివారిని ఊరికే వదిలేస్తే అమాయకులపై వారి ప్రతాపాన్ని చూపిస్తుంటారు అంటూ ట్రోల్ చేశారు.



ఆ వీడియో అలా అలా సీఎం హేమంత్ సోరెన్ వరకు వెళ్లింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి నీచమైన, అనుచితమైన ప్రవర్తను ఏ మాత్రం భరించవద్దు’ అంటూ డీజీపీ ఎమ్ వీ రావుకు ట్యాగ్ చేశారు. దీంతో వెంటనే సస్పెండ్ చేసి దర్యాఫ్తునకు ఆదేశాలు జారీ చేసారు డీజీపీ. లాక్ డౌన్ విధుల్లో పోలీసులు ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి డ్యూటీలు చేస్తుంటే ఇటువంటి పోలీసుల వల్ల మొత్తం పోలీసు డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వస్తోందంటున్నారు నెటిజన్లు.