రెండేళ్లు అన్ లిమిటెడ్ ఫ్రీ డేటా, వాయిస్ కాల్స్.. రిలయన్స్ జియో బంపరాఫర్

Jio Phone 2021 bumper Offer: భారత టెలికం రంగంలో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, తాజాగా మరో బంపరాఫర్ ను ప్రకటించి, పోటీలో ఉన్న ఇతర టెల్కోలకు షాక్ ఇచ్చింది. అతి త్వరలోనే తాము రూ.1,999 ధరలో కొత్త మొబైల్ ఫోన్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించింది.

New JioPhone 2021 పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్.. కొనుగోలు చేసేవారికి రెండేళ్ల పాటు ఉచిత అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇస్తామని చెప్పింది. అలాగే నెలకు 2 గిగాబైట్ల డేటాను ఉచితంగా వాడుకోవచ్చని, రెండేళ్లలో మొత్తం 48 జీబీ డేటాను పొందొచ్చని తెలిపింది. ఎలాంటి రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

24 నెలలు అవసరం లేదని అనుకునే వారికోసం మరో కొత్త ఫోన్ తీసుకొచ్చింది జియో. రూ. 1,499 ధరలో మరో ఫోన్ ను విడుదల చేస్తున్నామని, ఈ ఫోన్ తో ఏడాది పాటు అపరిమిత కాల్స్, నెలకు 2 జీబీ డేటాను పొందవచ్చని చెప్పింది. ఇక ఇప్పటికే జియో అందిస్తున్న ఫీచర్ ఫోన్ ను వాడుతున్న వినియోగదారులు, రూ. 749తో రీచార్జ్ చేసుకుంటే, రెండేళ్లు అమలులో ఉండే ఇవే ఆఫర్లు పొందవచ్చని వెల్లడించింది.

మార్చి 1 నుంచి ఈ ఆఫర్ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే దేశంలో జియో ఫీచర్ ఫోన్ వినియోగదారులు 100 మిలియన్ల మంది ఉన్నారన్న జియో, ఆ సంఖ్యను 300 మిలియన్లకు పెంచుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త ఆఫర్లు తీసుకొచ్చినట్టు ప్రకటించింది.

జియో ఫోన్ తొలుత 2017లో లాంచ్ అయ్యింది. 4జీ సౌకర్యం ఉన్న తొలి ఫీచర్ ఫోన్ జియోదే. కియోస్ మీద రన్ అవుతుంది. 2.4 ఇంచ్ డిస్ ప్లే. 2-megapixel rear camera, 0.3-megapixel selfie camera. దీనికి తోడు Jio Phone WhatsApp, YouTube లాంటి యాప్స్ ను సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఫీచర్ ఫోన్లు తీసుకొచ్చిన జియో.. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్లు తీసుకురావడంపైనా దృష్టి పెట్టింది. తక్కువ ఖరీదు గల ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు అభివృద్ధి చేసే పనిలో జియో ఉంది. గూగుల్ భాగస్వామ్యంతో ఈ స్మార్ట్ ఫోన్లు తీసుకురానుంది.

ట్రెండింగ్ వార్తలు