Bjp
JP Nadda మరికొన్ని నెలల్లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇవాళ బీజేపీ..జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. దేశంలో కరోనా ప్రబలిన తర్వాత తొలిసారి బీజేపీ జాతీయ కార్యవర్గం ఢిల్లీలో ప్రత్యక్షంగా సమావేశమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 124 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎల్ కే అద్వాణీ,మురళీ మనోహర్ జోషి వంటి పలువురు నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది.
జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు మోదీని గజమాలతో సత్కరించారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో సవాళ్లను ఎదుర్కొంటూ దేశాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నందుకుగాను బీజేపీ కార్యకర్తలందరి తరపున మోదీని అభినందిస్తూ సీనియర్ నేతలు సత్కరించారు.
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ…బీజేపీ శక్తిని ఇంకా పూర్తిస్థాయిలో చూడలేదన్నారు. బీజేపీ ఇంకా శిఖరాగ్రాలకు చేరలేదని, త్వరలోనే ఇది వస్తుందన్నారు. బూత్, ఓటర్ల జాబితా స్థాయిలో పార్టీని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సాధారణ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల వరకు.. బీజేపీ ఓట్ల శాతం పెరుగుతూనే ఉందన్నారు. జమ్ముకశ్మీర్‌లోనూ ఇటీవల బాగా పుంజుకుందన్నారు. బెంగాల్లో బీజేపీ కొత్త అధ్యాయం సృష్టిస్తుందన్నారు. కార్యకర్తలు, ఓటర్ల వెంట తామున్నామన్నారు.
ఈ సందర్భంగా ప్రధానిపై నడ్డా ప్రశంసలు కురిపించారు. కరోనా వైరస్ సమయంలో ఎంతో ధైర్యంతో మోదీ లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారని, ఆర్థిక సవాళ్లను అధిగమించారని కొనియాడారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు వేగంగా నిత్యావసరాలు అందించిందని, కరోనాను సమర్థంగా ఎదుర్కొందన్నారు. మోదీనే మొత్తం ముందుండి నడిపించారని స్పష్టం చేశారు. కరోనాని ఎలా ఎదుర్కోవాలో మోదీ.. ప్రపంచానికి చూపించారని నడ్డా అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అనేక సంస్కరణలు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రశంసించారు.
ALSO READ Bhupalpally : ప్రమాదానికి గురైన పోలీస్ వాహనం.. ఏఎస్ఐ మృతి