సోనియా గాంధీకి బీజేపీ చీఫ్ లేఖ

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు మోడీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థతే కారణమని సోమవారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC)ఆరోపించిన విషయం తెలిసిందే.

JP Nadda దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు మోడీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థతే కారణమని సోమవారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC)ఆరోపించిన విషయం తెలిసిందే. కనీసం వ్యాక్సిన్ల విషయంలోనైనా శాస్త్రీయంగా వ్యవహరించాలని, తక్షణమే ప్రధాని మోడీ నిపుణుల సలహాలు తీసుకుని వ్యాక్సిన్ డ్రైవ్ పై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC)తీర్మాణాలు చేసిన విషయం తెలిసిందే.

అయితే సీడబ్యూసీ తీర్మాణాలకు కౌంటరిస్తూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు. ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ సహా ఆ పార్టీ ముఖ్యమంత్రులు, ఇతర నేతలను అడ్రెస్ చేస్తూ జేపీ నడ్డా ఈ మేరకు మంగళవారం 4 పేజీల ఘాటు లేఖరాశారు. వ్యాక్సినేషన్ విధానాన్ని, కోవిడ్-19 మహమ్మారిని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని నడ్డా ఆరోపించారు. కరోనా వైరస్ వ్యాప్తి, కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ విధానంపై ప్రజలను తప్పుదోవపట్టించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని ఆ లేఖలో జేపీ నడ్డా మండిపడ్డారు. వ్యాక్సినేషన్ పై తప్పుడు ఆందోళనలు సృష్టించవద్దని, జనాన్ని మభ్యపెట్టడం మానుకోవాలని కాంగ్రెస్ ను హెచ్చరించారు.

కరోనా విపత్తుని నిర్వహించడంలో కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలు సమర్థవంతంగా వ్యవహరించాయన్న జేపీ నడ్డా.. భారతదేశంలో వ్యాక్సిన్ తయారవడం అందరికీ గర్వకారణమైన విషయం కావాలని, అలాంటిది కాంగ్రెస్ నేతలు మాత్రం వ్యాక్సిన్లను ఎగతాళి చేసే ప్రయత్నం చేశారని, ప్రజల మనసుల్లో సందేహాలు సృష్టించే ప్రయత్నం చేశారని నడ్డా మండిపడ్డారు. ఏఐసీసీ పెద్దలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారారలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లను అనుమానించే చరిత్ర లేనటువంటి దేశంలో సందేహాలను సృష్టించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న రికార్డు కాంగ్రెస్‌కు దక్కిందన్నారు. అది కూడా వందేళ్ళకోసారి వచ్చే మహమ్మారి విలయం సృష్టిస్తుండగా ఇలా జరుగుతోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మధ్య సమాచార లోపం తీవ్రంగా ఉందా? అని ప్రశ్నించారు. నిజానికి వ్యాక్సినేషన్ ను డీసెంట్రలైజ్ చేయాలని గతంలో కాంగ్రెస్ పార్టీనే సలహాఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదలకు, అణగారిన వర్గాలకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విషయాన్ని నడ్డా గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధంగా పేదలకు సాయపడేందుకు ముందుకు వస్తాయా? ఉచితంగా వ్యాక్సిన్లు అందించగలవా? అని బీజేపీ చీఫ్ ప్రశ్నించారు. సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ.. లాక్‌డౌన్‌ను ఓ వైపు వ్యతిరేకిస్తూ, మరోవైపు కావాలంటున్నారని మండిపడ్డారు. కోవిడ్ రెండో ప్రభంజనంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకుండా, తమకు ఏ సమచారమూ రావడం లేదని ఆరోపిస్తున్నాయని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు