న్యాయం జరిగింది.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. అరగంటపాటు ఉరి కొయ్యలకే!

  • Publish Date - March 20, 2020 / 12:24 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలయ్యింది. దోషులుగా తేలిన ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను తీహార్‌ జైలులో ఇవాళ(20 మార్చి 2020) తెల్లవారుజామున 5గంటల 30నిమిషఆలకు ఉరి తీశారు. జైలు అధికారుల సమక్షంలో మీరట్‌ నుంచి వచ్చిన తలారి పవన్‌.. మనీలా తాళ్లతో ఉరి తీశారు. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్‌ కేంద్ర కారాగారంలో మూడవ నంబర్ గదిలో నలుగురిని ఒకేసారి ఉరి తీశారు.(జైలు లాక్‌డౌన్‌: నిర్భయ దోషుల ఉరికి ఏర్పాట్లు పూర్తి)

ఉదయం 4 గంటలకు నలుగురు దోషులకు అల్పహారం అందించారు. నిర్భయ నలుగురు దోషులకు తీహార్ జైల్లో ఉరిశిక్ష పూర్తయ్యింది. ఉరికంబం వద్ద 40 మంది సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దోషి వెంట 12 మంది సిబ్బంది ఉన్నారు. దోషులకు ఉరిశిక్షకు ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉరిశిక్షకు ముందు వినయ్ శర్మ బోరున ఏడ్చేశాడు. ఉదయం 5:30 గంటలకు నలుగురు దోషులకు ఉరి తీశారు తలారి పవన్. 

వారిని అరగంట వరకు ఉరి కొయ్యలకు అలాగే వ్రేలాడదీస్తారు. ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసారి. దోషులను ఉరి తీయడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం ప్రకటించారు. తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు ఇప్పటికి శాంతి చేకూరిందని నిర్భయ తల్లి ఆశా దేవి విక్టరీ సింబల్ చూపిస్తూ చెప్పారు.