NV Ramana Birthday : ఎన్వీ రమణ పుట్టినరోజు..రైతు కుటుంబం నుంచి సీజేఐ వరకు..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పుట్టినరోజు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి భారత అత్యున్నత ధర్మాసనం న్యాయమూర్తిగా నూతలపాటి వెంకటరమణ ప్రస్థానం..ఎంతో స్ఫూర్తిదాయం.

N V Ramana Birthday

supreme court judge N V Ramana Birthday Special : ‘కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు..మహా పురుషులు అవుతారను..తరతరాలకు తరగని వెలుగు అవుతారని ఇలవేలుపులవుతారు‘ అని అడవిరాముడిలో పాట. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ జీవిత ప్రస్థానం చూస్తే. ఎన్వీ రమణ పూర్తి పేరు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ. ఆగస్టు 27 ఆయన పుట్టిన రోజు. 1957లో ఏపీలోని కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రమణ నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి 1983 లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఓ అత్యంత సాధారణ రైతు కుటుంబం నుంచి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు. 2021 ఏప్రిల్ 24 వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఎన్వీ రమణ.

గణపతిరావు, సరోజిని దంపతులకు జన్మించిన రమణ చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకే. ఆయన తాత బాపయ్య చౌదరి కంచికర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసి, అమరావతి లోని ఆర్.వి.వి.ఎన్. (రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు) కాలేజీలో బి.యస్సీలో పట్టా పొందాడు. 1982 లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10 న రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదై న్యాయవాదిగా వృత్తి ప్రారంభించారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా నమోదు చేసుకున్నాki. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా పలు కేసులు వాదించారు. అదే కోర్టుకు చీఫ్ జస్టిస్ అయ్యారు.రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఎన్వీ రమణ ప్రత్యేకత. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా పనిచేశారు. అదనపు అడ్వకేట్ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.సివిల్‌, క్రిమినల్‌ చట్టాలతో పాటు రాజ్యాంగపరమైన అంశాల్లో దిట్టనే పేరు తెచ్చుకున్నారు. 2000 జూన్ 27న హైకోర్టు పర్మినెంట్ జడ్జిగా నియమితులయ్యారు. దేశ, విదేశాల్లో జరిగిన పలు న్యాయసదస్సుల్లో జస్టిస్ రమణ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠంపై ఎన్వీ రమణ
ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన డి మురుగేశన్ జూన్ లో పదవీ విరమణ చెయ్యడంతో ఆయన స్థానంలో జస్టిస్ రమణను ప్రధాన న్యాయమూర్తిగా భారత ప్రధాన న్యాయమూర్తి పి. సతాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు 2013 సెప్టెంబరు 2 న, రాజ్ నివాస్ లో ఆడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేతుల మీదుగా జస్టిస్ రమణ ప్రమాణ స్వీకారం చేశాడు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి
2014 ఫిబ్రవరి 7 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన రెండవ తెలుగు వ్యక్తి. అప్పటికే జస్టిస్ చలమేశ్వర్ సుప్రీం కోర్టులో న్యాయ మూర్తిగా కొనసాగుతున్నాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తెలుగువారిలో వెంకట రమణ రెండవ వ్యక్తి. 1966 జూన్ 30 నుండి 1967 ఏప్రిల్ 11 వరకు కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేసాడు.

తెలుగు భాషంటే ఇష్టం..
వెంకటరమణకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. అవసరమైతే తప్ప ఆంగ్లంలో మాట్లాడరు. తెలుగులోనే పలుకరిస్తారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తెలుగునే ఎక్కువగా వాడుతుంటారు. ‘కోర్టు వ్యవహారాల్లో పారదర్శకత అవసరం. మనకు తెలిసిన మన యాసతో కూడిన, మన తెలుగుభాషలో మాట్లాడడానికి, కేసుల్లో వాదించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు’ అంటారాయన. మాతృభాష ఎదుర్కొంటున్న నిరాధారణ పట్ల పలువేదికలపై ఆవేదన చెందారాయన. ‘ఇంగ్లీష్ స్కిల్స్ ఫర్ లాయర్స్” అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా “చైనా, జపాన్ లలో ఆంగ్లానికి ప్రాధాన్యమేమీ లేదనీ..అయినా ఆ దేశాలు ఎంతో అభివృద్ది సాధించాయని తెలిపారు. ఆంగ్లం వస్తేనే అభివృద్ది చెందగలమనే కేవలం అపోహ మాత్రమేనంటారాయన. అలా మాతృభాషపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరచారు రమణ.

ఆల్మట్టి పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా పనిచేశాడు.
13 సంవత్సరాల కాలంలో దాదాపు 60వేల కేసులు పరిష్కారం..రమణ ప్రత్యేకత
ముస్లిం రిజర్వేషన్లపై విచారణ జరిపిన ఐదుగురు జడ్జీల ధర్మాసనంలో జస్టిస్‌ రమణ కూడా ఉన్నాడు. ఈ కేసులో మెజారిటీ జడ్జీల తీర్పుతో ఆయన విభేదించాడు. కులాలు, మతాలవారీ రిజర్వేషన్లు సంఘాన్ని విడగొడతాయని, రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగానే ఉండాలన్నారు. పర్యావరణ కేసుల్లో చెరువులు, కుంటల పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదనీ..అటవీ విస్తీర్ణాన్ని పెంచాలనీ తీర్పులు వెలువరించారు.

55 ఏళ్ల తరువాత తెలుగు తేజానికి న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానం
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్రకటనతో 55 ఏళ్ల తర్వాత…అవును అర్ధశతాబ్దం తర్వాత జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ ద్వారా న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవి దక్కింది. సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేసిన క్రమంలో 2021 ఏప్రిల్ 24న ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరిచారు జస్టిస్‌ ఎన్వీ రమణ. ఆయన 2022 ఆగస్టు 26దాకా..16నెలల పాటు సుప్రీం చీఫ్‌ జస్టిస్‌గా కొనసాగనున్నారు. అలా ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రస్థానం కొనసాగింది. ముక్కుసూటి మనస్తత్వం..నిరాడంబరత జస్టిస్ఎన్వీ రమణ ప్రత్యేకత.