Siddaramaiah, DK Shivakumar
Karnataka Congress Party: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత సిద్ధ రామయ్య, కర్ణాటక పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లలో ఎవరికి సీఎం పదవి వరిస్తుందనే అంశంపై కర్ణాటక రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మే18 లేదా 20 తేదీల్లో నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని టాక్ వినిపిస్తున్నక్రమంలో.. కర్ణాటక సీఎం ఎవరు అనే విషయంపై నేడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టత ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్ధ రామయ్య ఢిల్లీ వెళ్లగా.. ఈరోజు ఉదయం డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. వీరు ఢిల్లీలో ఉండగానే.. వీరిలో ఒకరిపేరును సీఎంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
రహస్య ఓటింగ్‌లో ఎవరికి మద్దతు లభించింది..?
కర్ణాటక సీఎం పీఠంకోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఎవరిని సీఎంగా ప్రకటించాలనే విషయంలో కేంద్ర పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం పీఠంకోసం పేరు ఎంపిక విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించారు. ఈ క్రమంలో ఖర్గే సోమవారం ముగ్గురు పరిశీలకులతో కమిటీ వేశారు. వీరు కర్ణాటకలో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన 135 మంది నుంచి స్లిప్పుల ద్వారా రహస్య ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు.
ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణతో సోమవారం ఢిల్లీకి చేరుకున్న ముగ్గురు పరిశీలకులు ఖర్గే నివాసానికి వెళ్లి ఆ నివేదికను అందజేశారు. ఎక్కువశాతం ఎమ్మెల్యేలు సిద్ద రామయ్యకే మొగ్గుచూపినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చజరుగుతుంది. ఈ నివేదికను ఖర్గే ఈ రోజు సోనియా, రాహుల్ కు అందజేయనున్నారు. సిద్ధ రామయ్య, శివకుమార్ సమక్షంలో ఈ నివేదిక వివరాలను సోనియా, రాహుల్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
Karnataka: సీఎంగా సిద్ధరామయ్య.. డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి సహా కీలక శాఖలు?
కర్ణాటకలో సీఎం పీఠానికి సరియైన వ్యక్తి సిద్ధరామయ్య అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొదటి.. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సిద్ద రామయ్య పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రెండో కారణం.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు విషయంలో శివకుమార్‌ను ఈడీ ప్రశ్నించడమే కాకుండా జైలుకుసైతం పంపింది. ఒకవేళ శివకుమార్‌ను సీఎంగా చేస్తే కేంద్ర సంస్థలు కాంగ్రెస్‌ను మరింత ఇరుకున పెట్టే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా క్లీన్ ఇమేజ్ కలిగిన సిద్ధ రామయ్యకు సీఎం పగ్గాలు అప్పగించే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.