Karnataka Congress: కర్ణాటకలో కాంగ్రెస్‌కు సరికొత్త ఉత్సాహం.. ఎందుకో తెలుసా?

కాంగ్రెస్ నేతలారా వినండి.. మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది... నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. మీ ఇళ్లల్లోనో.. ఆఫీసుల్లోనో.. బోర్డులపైనో.. లేక గోడలపైనో కచ్చితంగా రాసుకోవాల్సిన సింగిల్‌వర్డ్ ఒకటుంది.

DK Shivakumar – Siddaramaiah: కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్‌కు ఓ పాఠం నేర్పాయి. ఎన్నికల్లో గెలుపు ఓటములు పక్కనపెడితే.. కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ నేతలు పోరాడిన తీరు ది గ్రాండ్ ఓల్డ్ పార్టీకి సరికొత్త ఉత్సాహాన్నే ఇచ్చింది. అధికార బీజేపీ బలం ముందు కాంగ్రెస్ నిలబడగలదా అన్న స్టేజ్ నుంచి గెలవబోతోందనే స్థాయికి చేరుకుంది హస్తం పార్టీ. గ్రూపులు, విబేధాలు, కలహాలు, అంతర్గత పోరాటాలు.. కాంగ్రెస్ అంటే ఒకప్పుడు ఇవే గుర్తుకొచ్చేవి. కర్ణాటకలోనూ సేమ్ టూ సేమ్. కానీ.. ఎన్నికల సమయంలో కర్ణాటక కాంగ్రెస్ గ్రూపు వార్‌కు బైబై చెప్పింది. హార్ట్ టూ హార్ట్ (Heart to Heart) కమిట్‌మెంట్‌తో పోరాడింది. అదే ఎన్నికల సమయంలో హస్తం పార్టీకి బలంగా మారింది.

ఐక్యతే అసలు బలం
కాంగ్రెస్ నేతలారా వినండి.. మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది… నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. మీ ఇళ్లల్లోనో.. ఆఫీసుల్లోనో.. బోర్డులపైనో.. లేక గోడలపైనో కచ్చితంగా రాసుకోవాల్సిన సింగిల్‌వర్డ్ ఒకటుంది. అదే యూనిటీ.. కన్నడ ఎన్నికల పోరాటంలో హస్తం నేతలు చూపించిన ఐక్యతే కాంగ్రెస్‌కు ఎంతో బలాన్నిచ్చింది. ఎగ్జిట్‌పోల్స్‌ కూడా ఇదే విషయాన్ని చాలా క్లియర్‌గా చెప్పాయి. కలిసి ఉంటే కలదు సుఖం.. అదే కొండంత బలం అంటూ కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా చేసిన పోరాటం సత్ఫాలితాలు ఇచ్చేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతలు అంతా కలిసికట్టుగా పనిచేస్తే సానుకూల ఫలితాలు వస్తాయనే విషయం కర్ణాటకలో కనిపిస్తోంది. కానీ, కాంగ్రెస్‌లో ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు అన్నట్లు తయారైంది పరిస్థితి.

కాంగ్రెస్‌లో మార్పునకు సంకేతం
అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలతోపాటు ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నేతల మధ్య గ్రూప్ వార్ జరుగుతోంది. వరుస ఓటములతో పార్టీ పతనమైనా కాంగ్రెస్ నాయకులు మాత్రం మారటం లేదు. మారితే ఎలాంటి ఫలితం ఉంటుందో కర్ణాటక కాంగ్రెస్ చూపుతోంది. ఎన్నికల ఫలితాలు ఇంకా విడుదల కాకున్నా.. పోలింగ్ వరకు కలిసికట్టుగా పోరాడిన కన్నడ కాంగ్రెస్ నేతలు విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారని ఎగ్జిట్‌పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఇది కాంగ్రెస్‌లో వచ్చిన మార్పునకు సంకేతం అంటున్నారు పరిశీలకులు. కర్ణాటకే కాదు మిగిలిన రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధిష్టానం ఈ గ్రూప్ వార్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెడితే మున్ముందు మరింత మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది.

కుమ్ములాటలతోనే బలహీనపడిన కాంగ్రెస్
వాస్తవానికి బీజేపీ బలపడింది అనే కన్నా… కాంగ్రెస్ బలహీనపడిందనే ఎక్కువగా చెబుతుంటారు. ఇలా చెప్పడానికి ప్రధాన కారణం హస్తం పార్టీ నేతలే… ఎవరు ఔనన్నా.. కాదన్నా.. గ్రూపు తగాదాలు.. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ ఒక్కోరాష్ట్రాన్ని కోల్పోతూ వచ్చింది. జాతీయస్థాయిలో బీజేపీ బలపడిందంటే అది కేవలం కాంగ్రెస్ స్వయంకృతమే అంటుంటారు విశ్లేషకులు. వరుస ఓటములు కుంగదీసినా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తీరు మారలేదు.

పతాకస్థాయికి గ్రూప్ వార్
ఆధిపత్యం కోసం పోరాటం కాంగ్రెస్‌లో చాలా కామన్‌గా మారిపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌తో సహా ఆ పార్టీ బలంగా ఉన్న మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ల్లో అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్‌ను పతనావస్థకు తీసుకువెళ్లాయి. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగాల్సిన రాజస్థాన్‌లో గ్రూప్ వార్ హైరేంజ్‌కు చేరుకుంది. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య పతాకస్థాయిలో వార్ జరుగుతోంది. అధిష్ఠానం ఆదేశాలను సైతం ధిక్కరించే స్థాయిలో కొనసాగుతున్న అంతర్గత యుద్ధం రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితికి దారితీస్తోందో చూడాల్సివుంది.

అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా..
ఈ గ్రూప్‌వార్‌తోనే మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా.. అధికారం బీజేపీకి అప్పగించాల్సివచ్చింది. సీనియర్ నేత కమలనాథ్‌ను ధిక్కరించి యువనేత జ్యోతిరాదిత్య సిందియా బీజేపీ గూటికి చేరిపోవడంతో కమలనాథ్ సర్కార్ కుప్పకూలింది. పంజాబ్‌లోనూ అంతే అధికారంలో ఉన్న అన్నాళ్లూ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్, అప్పటి పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ మధ్య వార్ నడిచింది. ఎన్నికల ముందు అమరీందర్‌ను పదవి నుంచి తప్పించడంతో ఆయన పార్టీపై తిరుగుబాటు చేసి సొంతకుంపటి పెట్టుకున్నారు. అనంతరం కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.

ఛత్తీస్‌గడ్‌లోనూ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌, సీనియర్ నేత టీఎస్ సింగ్ డియో మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 2018లో పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఇద్దరి మధ్య సీఎం పీఠంపై పంచాయితీ జరిగింది. ఇద్దరు చెరో రెండున్నరేళ్లు పదవిలో కొనసాగేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి బఘేల్ ఈ డీల్‌కు తిలోదికాలు ఇవ్వడంతో గ్రూప్‌వార్ స్టార్ట్ అయింది. ఈ రాష్ట్రంలోనూ ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. గ్రూప్ వార్ ఎవరికొంప ముంచుతుందోననే టెన్షన్ పడుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.

Also Read: మీకు తెలుసా, కర్ణాటకలో 1999 నుంచి కాంగ్రెసే టాప్. అయినా కూడా..?

తెలంగాణలోనూ సేమ్ సీన్
ఇవన్నీ ఎందుకు? తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ సేమ్ సీన్. తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నా.. మరికొద్ది నెలల్లో ఎన్నికలకు వెళ్లాల్సిన స్టేజ్‌లో కూడా తెలంగాణ కాంగ్రెస్ గ్రూప్ వార్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందనే టాక్ వినిపిస్తుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వర్గం ఒకవైపు సీనియర్ లీడర్లు మరోవైపు అన్నట్లు అంతర్గత యుద్ధం కొనసాగుతుంది ఇక్కడ. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. రేవంత్ వర్సర్ సీనియర్ల యుద్ధంతో ఏఐసీసీ పరిశీలకుడు మాణిక్యం ఠాగూర్‌ను మార్చింది కాంగ్రెస్. ప్రస్తుత ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టాక ఈ అసంతృప్తి స్వరాలు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా.. అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. రగులుతున్న అగ్నిపర్వతంలా ఎప్పుడైనా బద్ధలయ్యే ఉందనే భయంతోనే టీపీసీసీ అసంతృప్తులపై ఓ కన్నేస్తూ… వారిని ఒప్పిస్తూ కార్యక్రమాలు కొనసాగించాల్సి వస్తోంది.

Also Read: కర్ణాటకకు ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్.. కన్నడ ఓటర్లు ఆ రికార్డ్‌ని బ్రేక్ చేస్తారా?

కర్ణాటక ఎన్నికలతో అనూహ్యమైన మార్పు
ఇలా కాంగ్రెస్ అంటే విబేధాలకు చిరునామాగా చెప్పే పరిస్థితుల్లో కర్ణాటక కాంగ్రెస్ అనూహ్యమైన మార్పు తెచ్చింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వరకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సీఎల్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య తీవ్రస్థాయి విబేధాలు ఉండేవి. ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఎవరికి వారే.. వేర్వేరుగా కార్యక్రమాలు చేసుకునేవారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేలా పనిచేసేవారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో ఈ ఇద్దరి మధ్య పంచాయితీ జరుగుతుందని.. బీజేపీ కూడా ప్రచారం చేసింది. అంతర్గత విబేధాలు సరిదిద్దుకోలేని కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే రాష్ట్రం భ్రష్టుపట్టిపోతోందని విమర్శలకు దిగింది బీజేపీ. ఈ ఆరోపణలు.. విమర్శలకు చెక్ చెప్పేలా మారిపోయింది కన్నడ కాంగ్రెస్. డీకే.. సిద్ధూ ఒక్కటే అనేలా రాహుల్ జోడోయాత్ర నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్. ఎన్నికల ప్రచారంలోనూ ఈ ఇద్దరిపై రకరకాల వార్తలు ప్రచారమయ్యాయి. అయితే ప్రచార గడువు ముగియడానికి ఒక్కరోజు ముందు సిద్ధరామయ్య ఇంటికి వెళ్లి బీజేపీ ప్రచారానికి చెక్ చెప్పారు డీకే.