అంతా డిజిటల్ : గ్రామాల్లో మొబైల్ ATMలు 

  • Publish Date - November 8, 2019 / 06:05 AM IST

నగరం..పట్టణం..పల్లెలు ఇలా అంతా డిజిటల్..డిజిటల్..పెరుగుతున్న టెక్నాలజీని అందరూ ఫాలో అయిపోతున్నారు. ముఖ్యంగా బ్యాంకుల్లో డిజిటల్ సేవలు పెరిగాయి. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ పెంచే యత్నంలో కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (కెజిబి) రాష్ట్రంలోని అనేక జిల్లాలలో కలబురగిలో ‘మొబైల్ ఎటిఎం’లను ప్రారంభించింది.

ప్రత్యేక వాహనంలో వివిధ బ్యాంకింగ్ పథకాల వీడియోలను చూపించడానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఏటీఎం  స్క్రీన్ ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.  

ఈ సందర్భంగా కెజిబి మేనేజర్ గిరీష్ హెబ్బర్ మాట్లాడుతూ..బ్యాంక్ పథకాలకు సంబంధించి అన్ని విషయాలను రైతులకు అవగాహన కల్పించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. రైతులు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడానికి డిజిటల్ ఎటిఎంలను ఎలా ఉపయోగించాలి అనే విషయంపై అవగాహన కల్పించటమే మా లక్ష్యం అని తెలిపారు. 

ఈ అవగాహనా ప్రాజెక్టుకు నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఫండ్ సహకరించిందని ఆయన తెలిపారు. మొబైల్ ఎటిఎంలు రైతుల ఇంటి ముందుకే తీసుకెళుతున్నామనీ..బ్యాంకింగ్ పథకాలు..డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి వారికి పూర్తిగా అవగాహన కలిగేలా చేస్తున్నామని అన్నారు. ఈ మొబైల్ ఏటీఎం వ్యాన్లలో ఒక బ్యాంకు అధికారి ఉంటారు, వారు డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మరియు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని రైతులకు..స్థానికులకు తెలియజేస్తారు. ఇప్పటికే 68 జిల్లాలల్లో  కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ఈ మొబైల్ ఏటీఎంల సేవల్ని అందిస్తోంది. 

ఈ విషయంపై స్థానిక సంతోష్ అనే  రైతు మాట్లాడుతూ..బ్యాంకులు ఇటువంటి సేవల్ని అందించటం చాలా మంచి విషయమనీ..డిజిటల్ పై అవగామన పెంచుకోవటం వల్ల సమయం ఆదా అవుతుందని ఇతర బ్యాంకులు కూడా ఇటువంటి సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని..కర్ణాటక గ్రామీణ బ్యాంక్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించాడు. 

చాలా గ్రామాల్లో ఎటిఎంల సౌకర్యం లేదని ఈ విషయంపై అన్ని బ్యాంకులు దృష్టి పెట్టాలనీ..ఎటిఎం సౌకర్యాలను ప్రతీ గ్రామాలకు అందజేయాలని సూచించాడు సంతోష్. డబ్బులు కావాలంటే బ్యాంకులకు వెళ్లటం..లైన్లలో నిలబడటంతో టైమ్ వేస్టు అవుతోందని ..అంతేకాదు చాలా శ్రమతో కూడుకున్న పని అన్నారు. అంతేకాకుండా, బ్యాంకు పథకాలపై సరైన అవగాహన రైతులకు ఇటువంటి మొబైల్ ఏటీఎం సేవలు చాలా సహాయపడతాయని అన్నారు.