నడిచే దేవుడు:శివకుమార స్వామి శివైక్యం

కర్ణాటకలోని తముకూరులోని సిద్దగంగా మఠాధిపతి శివకుమార స్వామిజీ మృతి చెందారు. 111 ఏళ్ల వయస్సులో సోమవారం(జనవరి 21, 2019) ఆయన మృతిచెందారు. వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో రెండువారాలుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం చెన్నై హాస్పిటల్ లో కూడా స్వామిజీ చికిత్స తీసుకొని వచ్చారు. స్వామిజీ మృతిచెందడం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించేందుకు తముకూరుకి చేరుకొంటున్నారు. శివకుమార స్వామి  ది వాకింగ్ గాడ్(నడిచే దేవుడు)గా సీఎం కుమారస్వామి, ప్రతిపక్షనేత యడ్యూరప్ప అభివర్ణించారు. స్వామిజీని కడసారి చూసేందుకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తముకూరుకి చేరుకుంటుండటంతో మఠం దగ్గర భారీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు అధికారులు.

స్వామీజీ మృతితో కర్ణాటక ప్రభుత్వం మూడు రోజులను సంతాప దినాలుగా ప్రకటించింది. స్వామీజి మృతికి నివాళిగా రాష్ట్రవ్యాప్తంగా  మంగళవారం కాలేజీలు, స్కూల్స్, ప్రభుత్వ ఆఫీసులు మూసివేయనున్నారు.
 

శివకుమార స్వామి మృతి పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో ఒకసారి సిద్దగంగా మఠాన్ని దర్శించుకొని, స్వామిజీ ఆశిస్సులు తీసుకొనే అదృష్టం తనకు లభించిందని మోడీ గుర్తుచేసుకొన్నారు. స్వామిజీ సమాజానికి చేసిన సేవలు మర్చిపోలేనివని మోడీ అన్నారు.

. సమాజానికి స్వామీజీ ఎంతో సేవ చేశారని, ముఖ్యంగా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లో ఆయన సేవలు మర్చిపోలేనివని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అనంతమైన ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అని కోవింద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు