బీజేపీ ఉపాధ్యక్షురాలిగా అనంత్ కుమార్ భార్య

దివంగత మాజీ కేంద్ర మంత్రి అనంత కుమార్ భార్య తేజస్విని అనంతకుమార్‌ ను కర్ణాటక బీజేపీ  ఉపాధ్యక్షురాలిగా పార్టీ అధిష్ఠానం నియమించింది.మాజీ సీఎం,కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మంగళవారం(ఏప్రిల్-2,2019) ఈ విషయాన్ని ప్రకటించారు.

అనంత్ కుమార్ మరణంతో ఈ ఎన్నికల్లో బెంగళూరు సౌత్ లోక్ సభ స్థానం నుంచి ఆయన భార్య తేజస్విని అనంతకుమార్‌ ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తోందని అందరూ భావించారు.అయితే తేజస్వినికి బీజేపీ టికెట్ నిరాకరించింది.న్యాయవాది అయిన 28 ఏళ్ల యువకుడు తేజస్వి సూర్యకు బెంగళూరు సౌత్ టికెట్ ను బీజేపీ కేటాయించింది.అయితే పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, మోడీ కోసం, పార్టీ కోసం పనిచేస్తామని ఆమె చెప్పారు.ఈ సమయంలో ఆమెను పార్టీ ఉపాధ్యక్షురాలిగా బీజేపీ అధిష్ఠానం నియమించింది.సౌత్ బెంగళూరు లోక్ సభ స్థానంలో బీజేపీకి గట్టి పట్టు ఉంది.1996 నుంచి వరసగా ఆరుసార్లు అనంతకుమార్ ఇక్కడి నుంచే విజయం సాధించారు.