సూపర్ ఐడియా, స్కూల్స్ ఇలా నిర్వహిస్తే విద్యార్థులకు కరోనా సోకుతుందనే భయమే ఉండదు

  • Publish Date - August 2, 2020 / 03:34 PM IST

కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. మార్చి నుంచి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ బంద్ అయ్యాయి. విద్యా సంస్థలను తిరిగి ఎప్పుడు తెరుస్తారో క్లారిటీ లేదు. దీనిపై ప్ర‌భుత్వాలు త‌ర్జ‌నభ‌ర్జ‌న ప‌డుతూనే ఉన్నాయి. రోజురోజుకి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు ఎప్పుడు తెరుస్తారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కరోనా తగ్గే వరకు ఇలా మూసి ఉంచుతారా? లేదంటే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్కూళ్లకు అనుమతులిస్తారా? అని అంతా ఎదురుచూస్తున్నారు. కాగా, చాలావరకు ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ లో క్లాసులు ప్రారంభించాయి. పలు సమస్యల కారణంగా ఇంకా చాలా స్కూళ్లు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి.



పిల్లలు, తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీ:
ఈ సమస్యకు కశ్మీర్ లోని అధికార యంత్రాంగం చక్కని పరిష్కారం చూపింది. అదే ఔట్ డోర్ స్కూల్, ఓపెన్ ఎయిర్ క్లాసెస్. అంటే ఆరుబయట చెట్ల కింద అన్న మాట. అది కూడా భౌతికదూరం పాటిస్తూ. బద్గామ్ జిల్లాలోని దూద్ పత్రి ప్రాంతంలో అధికారులు ఔట్ డోర్ స్కూల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు కొండ ప్రాంతంపై ఓపెన్ ఎయిర్ లో క్లాసులకు హాజరవుతున్నారు. ఈ ఔట్ డోర్ స్కూల్ ప్లాన్ అందరికి తెగ నచ్చేసింది. పిల్లలు, తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా అయితే కరోనా వచ్చే అవకాశమే లేదన్నది వారి అభిప్రాయం. అధికారులు స్థానికులతో మాట్లాడి ఇలాంటి ఓపెన్ స్కూల్స్ మరిన్ని ప్రారంభించాలని కోరుతున్నారు.





ఓపెన్ ఎయిర్ స్కూల్ గా టూరిస్ట్ ప్లేస్:
వాస్తవానికి దూద్ పత్రి ఓ హిల్ స్టేషన్. టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఈసారి టూరిస్టులు ఎవరూ రాలేదు. దీంతో ఈ ప్రాంతాన్ని ఔట్ డోర్ స్కూల్ గా మార్చేశారు. అదే రీతిలో మరిన్ని పర్యాటక ప్రదేశాలను ఇలాంటి వాటికి వాడుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. “భద్రతా చర్యలను దృష్టిలో ఉంచుకుని తరగతులు నిర్వహిస్తున్నాం” అని కమ్యూనిటీ స్కూల్ ఏర్పాటుకు సహకరించిన జోనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహ్మద్ రంజాన్ వాని అన్నారు. ఎగువ ప్రాంతాలలో అనూహ్య వాతావరణం కారణంగా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తరగతుల అమలు కోసం గుడారాలను వేయడానికి ప్రయత్నించామన్నారు.



ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ నిధులతో నడిచే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫోన్ల కొరత కారణంగా ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే పరిస్థితి లేదు. ప్రైవేట్ స్కూల్స్ లోనూ సమస్యలు లేకపోలేదు. విద్యార్థులు అందరికీ ఫోన్లు లేవు. ఈ పరిస్థితుల్లో గ్రామీణ కశ్మీర్ లో ఓపెన్ ఎయిర్ క్లాస్ రూమ్స్ ప్రతిపాదన అందరిని అట్రాక్ట్ చేస్తోంది.





ఐడియా బాగుందని ప్రశంసలు:
ఓపెన్ ఎయిర్ స్కూల్ కి వస్తున్న విద్యార్థుల్లో ఎక్కువమంది గుజ్జర్ బకార్ వల్ కమ్యూనిటీకి చెందిన వారు అని టీచర్లు తెలిపారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం వంటి కోవిడ్-19 కి సంబంధించిన అన్ని ప్రోటోకాల్స్ ను ఓపెన్-ఎయిర్ పాఠశాలలు అనుసరిస్తున్నాయని అధికారులు చెప్పారు. అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలకు వస్తారని, తరగతులకు అవసరమైనవి అందుబాటులో ఉండేలా చూస్తారని ఉపాధ్యాయులు చెప్పారు. అంతా బానే ఉన్నా ఓ సమస్య మాత్రం తెగ టెన్షన్ పెడుతోంది. అదే వాతావరణం. వర్షం పడితే ఆశ్రయం పొందటానికి మార్గం లేదు. మొత్తానికి సూపర్ ఐడియా అని అంతా ప్రశంసిస్తున్నారు.



ట్రెండింగ్ వార్తలు