కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్. సరిగ్గా ఏడాది క్రితం కర్ణాటకలో తాము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామని,ఐదేళ్లపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనసాగుతుందని ఆయన తెలిపారు.బీజేపీ నుంచి తాము ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం లేదని అయితే మే-23,2019 తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని ఆయన అన్నారు.జరగబోయేది ఇదేనని వేణుగోపాల్ తెలిపారు.ఏడాదిగా కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీ మెంటాలిటీని తెలియజేస్తుందని వేణుగోపాల్ అన్నారు.కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన సృష్టం చేశారు.
మే-23,2019 తర్వాత 23మంది కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కలకలం రేపాయి.బీజేపీ వ్యాఖ్యలతో అలర్ట్ అయిన కాంగ్రెస్ అధిష్ఠానం వేణుగోపాల్ ను పరిస్థితి చక్కదిద్దేందుకు కర్ణాటక పంపించింది.అందుబాటులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బుధవారం వేణుగోపాల్ సమావేశమయ్యారు.