ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీచర్లు, డాక్టర్లతో సహా వివిధ రంగాల్లో సేవలు అందించినవారే ఆప్‌కు వీఐపీలు. ప్రజల మధ్యే కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 62 స్థానాలను గెలుచుకుని విజయ దుందుభి మోగించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణ స్వీకార మెగా షోకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్టేడియంలో 40 వేల కుర్చీలు, ప్రజలు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూసేందుకు వీలుగా నలువైపులా పెద్ద పెద్ద టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి వచ్చే 50 మంది ఆహ్వానితుల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేదికపై ఢిల్లీ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నవారిని ఆప్ ఆహ్వానిస్తోంది. టీచర్లు, హెడ్‌మాస్టర్లు, ప్యూన్లు, విద్యార్థులు, మొహల్లా క్లినిక్‌లకు చెందిన డాక్టర్లు, మెట్రో, బస్సు, ఆటో డ్రైవర్లు, సఫాయి కార్మికులు, రైతులు, అంగన్‌వాడి కార్యకర్తలు తదితర రంగాల్లో సేవలందించినవారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నట్లు ఆప్ నేత మనీష్ సిసోడియా వెల్లడించారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందు టీచర్లపై ఒత్తిడి తెస్తున్నారన్న బీజేపీ ఆరోపణలను ఆప్ తిప్పికొట్టింది. ఉపాధ్యాయులను గౌరవించడం నేర్చుకోవాలని బీజేపీకి సూచించింది. ఆప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా కేజ్రీవాల్ ఆహ్వానించారు. కేజ్రీవాల్‌తో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కేజ్రీవాల్ మంత్రివర్గంలో కొత్త ముఖాలకు చోటు దక్కలేదు. గతంలో పనిచేసిన మంత్రులకే మరోసారి ఛాన్స్ ఇచ్చారు.
తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి రాజకీయ హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా జరుపుకుంటున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు, రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానం పలకలేదు. తనపై నమ్మకంతో మళ్లీ అధికారం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజల మధ్యే ముచ్చటగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు.
Read More :Film Fare Awards 2020 : టాప్ లేపిన గల్లీ బాయ్