కేజ్రీవాల్ గెలుపుతో….ఫుల్ హ్యాపీగా ఉన్న బీజేపీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో పత్ర్యేకంగా చెప్పనవసరం లేదు. సీఏఏ,షాహీన్ బాగ్,పాకిస్తాన్ వంటి అనేక అంశాలను రోజూ ప్రస్తావిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆఖరికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సైతం ఉగ్రవాది అంటూ సాక్ష్యాత్తూ కేంద్రమంత్రులే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని దాదాపు 50పబ్లిక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించారు. ఇక ప్రధాని మోడీ సైతం గట్టిగానే ర్యాలీలో పాల్గొన్నారు. అయినప్పటికీ బీజేపీకి ఓటర్లు అండగా నిలవలేదు.

మా ఢిల్లీ ముద్దు బిడ్డ అంటూ కేజ్రీవాల్ కు దేశరాజధాని ప్రజలు గంపగుత్తుగా ఓట్లు వేశారు. ఫలితంగా మొత్తం 70స్థానాల్లో 62సీట్లలో ఘన విజయం సాధించి సామాన్యుడి సత్తా చాటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 67సీట్లను ఆప్ సాధించిన విషయం తెలిసిందే. అయితే దశాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యంగా ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల్లో,మొన్న జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు  ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. మరో కొత్త విషయం ఏంటంటే 2015లో 9.7శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్,మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం4.26శాతం ఓట్లు మాత్రమే దక్కించుకుంది.

అయితే అసలు ఈ ఎన్నికలతో బీజేపీ పని అయిపోయింది, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అనుకుంటే పొరపాటే. ఈ ఎన్నికలను బీజేపీ ఓటమిగా కంటే కాంగ్రెస్ ఓటమిగా చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఈ ఎన్నికలు 2024లో బీజేపీకి మార్గం సుగుమం చేశాయని కూడా మరోరకంగా చెప్పవచ్చు. దేశమంతటా ఆప్ పవనాలు 2024కి వీయాలంటే ఏదైనా పెద్ద మ్యాజిక్ జరిగితే తప్ప సాధ్యం కాదు.

ఇప్పటివరకు జాతీయస్థాయిలో ప్రధానంగా అవునన్నా,కాదన్నా రెండు పార్టీలో ప్రధానంగా ఉన్నాయి. అందులో ఒకటి అధికార బీజేపీ,రెండవది ప్రతిపక్ష కాంగ్రెస్. ఈ రెండు పార్టీలను కాదని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి మరే కూటమి కూడా ఎక్కువ నెలల అధికారంలో ఉండదు అని చెప్పడానికి గత ఉదాహరణలు సరిపోతాయి. ఈ రెండు పార్టీలను కాదని గతంలో థర్డ్ ఫ్రంట్ వచ్చి…కేవలం నెలల పాలన మాత్రమే అందించి ఆ తర్వాత కనుమరుగైపోయిన సంగతి తెలిసిందే. 

పాన్ ఇండియా లెవల్ లో బీజేపీ భయపడేది కాంగ్రెస్ కు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ మాత్రం విపక్ష పార్టీలకు ఓ గొడుగులా మారిపోయింది. ప్రస్తుతం బీజేపీని ఢీకొట్టే సత్తా కాంగ్రెస్ లో లేదు అని చెప్పడం కంటే…ఢీ కొట్టాలన్న కసి ఆ పార్టీ నాయకుల్లో బలంగా కనిపించడం లేదు అని చెప్పవచ్చు. మోడీ ఇమేజ్ ను తోసేసి జాతీయస్థాయిలో ప్రధాని అభ్యర్థిగా నిలబడే వ్యక్తిగా కాంగ్రెస్ రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  ఆయన మాత్రం రాజకీయాల్లో మెరుపుతీగగా మారిపోయారు.

ఎప్పుడో ఒకసారి అలా ప్రజలముందు వచ్చి ఇలా కనుమరుగైపోతున్నారు రాహుల్ గాంధీ. యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటూ,ప్రజల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏవీ పెద్ద కనిపించడం లేదు. ఎప్పుడో ఒకసారి మోడీ,బీజేపీ విధానాలను,ప్రభుత్వ లోపాలను ట్విట్టర్ లో ఎత్తి చూపించడం తప్ప..ప్రజల్లోకి వాటిని బలంగా తీసుకెళ్లలేకపోతున్నారు. 

ఇక కాంగ్రెస్ గొడుగులో ఉన్న మమతాబెనర్జీ,శరద్ పవార్ పార్టీలు వాళ్ల రాష్ట్రాల్లో బలమైన పార్టీలుగా ఉన్నప్పటికీ సొంత ప్రాంతం దాటి బయట రాష్ట్రాల్లో ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు. జాతీయస్థాయిలో నాయకత్వాన్ని అందించి బీజేపీకి సీరియస్ ఛాలెంజ్ విసిరే పరిస్థితుల్లో ఈ పార్టీలు లేవు. 

ఇక ఢిల్లీలో మూడోసారి హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన అరవింద్ కేజ్రీవాల్…ప్రతి ప్రాధాన్యమైన ఇష్యూపైన బీజేపీ వ్యతిరేక వాయిస్ ను మీడియా ముందు గట్టిగానే వినిపిస్తున్నాడు. ప్రధాని మోడీ కేజ్రీవాల్ చాలా సులభంగా సవాల్ చేయగలడు కానీ అది న్యూస్ పేపర్ హెడ్ లైన్స్,టీవీ ఛానల్స్ డిబేట్స్ లో మాత్రమే. పత్రిపక్ష కూటమికి లీడర్ గా ఉండటానికి కేజ్రీవాల్ తన ఆమ్ ఆద్మీ పార్టీ బేస్ ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించాల్సిన అవసరం చాలా ఉంది. 

రాబోయే రెండేళ్లలో బీహార్,వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివర్లో బీహార్ లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే మరోసారి అధికారంలో రావాలని చూస్తున్న బీజేపీ-జేడీయూ కూటమిని ఆ రాష్ట్రంలో కేజ్రీవాల్ దెబ్బతీసే పరిస్థితి లేదు. బీహార్ లో కేజ్రీవాల్ బ్రాండ్ కు నితీష్ కుమార్ క్లీన్ ఇమేజ్ పెద్ద కౌంటర్. అసలు బీహార్ లో ఆప్ కు క్యాడర్,వాలంటీర్ బేస్ కూడా లేదు. ఇక వెస్ట్ బెంగాలో కూడా సేమ్ డైలామానే కేజ్రీవాల్ ఫేస్ చేస్తున్నాడు.

వెస్ట్ బెంగాల్ లో ఆప్ ను విస్తరించాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తే…మమతా బెనర్జీని జాతీయ రాజకీయాల్లో తన ప్రత్యర్థిగా మార్చే ప్రమాదం ఉంది. అయినా ఇప్పట్లో బెంగాల్ రాజకీయాల్లో మమతను దాటి ముందుకెళ్లే పరిస్థితి ఏ పార్టీలో భారీస్థాయిలో లేదు. ఇప్పుడిప్పుడే బెంగాల్ లో బలపడుతున్న బీజేపీతో ఆమె అక్కడ పెద్ద యుద్ధమే చేస్తుంది. మోడీ-షా టెర్గెట్ లో ఉన్న ఇష్యూస్ లో 2020 బెంగాల్ ఎన్నికలు ఒకటి.

ఇతర రాష్ట్రాల్లో ఉనికే లేని కేజ్రీవాల్ ని ప్రధాని అభ్యర్థిగా ఏ ఫెడరల్ ఫ్రెంట్ ,థర్డ్ ఫ్రంట్ లు ఆమోదించవు. మమతా బెనర్జీ,చంద్రబాబునాయుడు,కేసీఆర్,నవీన్ పట్నాయక్, శరద్ పవార్ వంటి మెయిన్ పొలిటీషియన్స్ మోడీకి 2024లో థర్డ్ ఫ్రంట్,లేదా ఫెడరల్ ఫ్రంట్ తరపున మోడీకి ఛాలెంజర్ గా ఎమర్జ్ అయ్యే అవకాశముంది. అయితే ఇదే బ్యాచ్ 2019లో తమ కూటమి తరపున ప్రధాని ఫేస్ గా ఓ కామన్ క్యాండిడేట్ ను ఉంచే విషయంలో ఫెయిల్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

ఇదే మరోసారి కాంగ్రెస్ ను…బీజేపీకి 2024లో ప్రధాన పోటీదారుగా ఉంచింది. మోడీకి జాతీయస్థాయిలో రాహుల్ గాంధీనే పోటీలో ఉంచే పరిస్థితి కల్పించింది. తమలో ఒకరిని ప్రధాని ఫేస్ గా మోడీ ముందు పెట్టడం కన్నా దాదాపు చాలా ప్రాంతీయపార్టీలు రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్థిగా ఉండేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. ఇక ప్రస్తుత రాహుల్ గాంధీ పరిస్థితి చూస్తుంటే 2024లో బీజేపీకి,నరేంద్రమోడీకి మరోసారి మార్గం సుగుమం చేసినట్లే సృష్టంగా అర్థమవుతోంది.