రాష్ట్రంలో పబ్ లకు పర్మిషన్ ఇవ్వనున్న ప్రభుత్వం 

  • Publish Date - November 12, 2019 / 12:45 PM IST

కేరళలో పబ్‌ల ఏర్పాటుకు అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలో పబ్‌లు లేకపోవడం పట్ల ప్రభుత్వంపై వస్తున్న విమర్శల దృష్ట్యా సీఎం పినరయి విజయన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రోజంతా ఎక్కువ సమయం పనిచేసి అలిసిపోయే ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రొఫెషనల్స్‌ నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించాక వారి ఉల్లాసం కోసం పబ్‌లను అనుమతించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు విజయన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పబ్ లు లేకరపోవటంతో ప్రభుత్వం పై  పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి.  కేరళ బెవరేజెస్‌ కార్పొరేషన్‌  ద్వారా నిర్వహించే రిటైల్‌ మద్యం దుకాణాల్లోనూ వినియోగదారులకు మెరుగైన వసతులు కల్పిస్తామని ఆయన చెప్పారు. 

” సందడి, ఉత్సాహం లేని జీవితం దేనికి? 24 గంటలూ పని గురించే ఆలోచిస్తే ఎలా? కాస్తంత సేద తీరే మార్గాలూ ఉండాలి కదా….అందుకే కేరళలో పబ్‌లు తెరిచే ఆలోచన ఉందని… పబ్‌లకు అవకాశం కల్పించడం లేదనేదే మాపై ఉన్న అతి పెద్ద ఆరోపణ… అని టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే వీక్లీ ప్రోగ్రాం “నామ్ మనూట్టు”లో ఆయన వ్యాఖ్యానించారు.

మద్యం షాపుల ముందు కస్టమర్లు క్యూ కట్టకుండా, వినియోగదారులకు వారు ఎంచుకున్న బ్రాండ్ లు లభ్యమయ్యేలా రాష్ట్రంలో మరిన్ని లిక్కర్‌ సూపర్‌ మార్కెట్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు. కాగా గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌  ప్రభుత్వం కేరళలో మద్యంపై పాక్షిక నిషేధం విధించింది.  ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో మాత్రమే మద్యం విక్రయాలకు అనుమతించారు. దీంతో 2014-17లో 700కు పైగా బార్లు మూతపడ్డాయి. ఆ తర్వాత వాటిని బీర్‌, వైన్‌ పార్లర్‌లుగా మార్చారు. 2016లో అధికారంలోకి వచ్చిన పినరయి విజయన్‌ ప్రభుత్వం మద్య నిషేధ విధానాన్ని సమూలంగా మార్చివేసింది. 2 స్టార్, త్రీస్టార్‌ హోటళ్లలోనూ మద్యం విక్రయాలకు అనుమతించింది. నిషేధాన్ని అమలు చేయడానికి ముందు రాష్ట్రంలో అత్యధిక తలసరి మద్యం వినియోగం ఉఁది. పర్యాటక రాష్ట్రమైన కేరళలో మద్యపాన వ్యతిరేక విధానం రాష్ట్ర ఆదాయాన్ని దెబ్బ తీసింది.