Elephant Pays Tribute: మావటి మృతి..కన్నీరు పెట్టుకుని ఘన నివాళి అర్పించిన గజరాజు

kerala elephant pays tribute : ఏనుగులను నడిపేవారిని దాని ఆలనా పాలనా వారిని మావటి అంటారనే విషయం తెలిసిందే. ఏనుగుతో మావటికి చాలా అనుబంధం ఉంటుంది.అలాగే దాని బాగోగులు చూసుకునే మావటిమీద కూడా ఆ ఏనుగుకి అనుబంధం ఉంటుంది. కానీ ఏనుగుకు తిక్క రేగితే మాత్రం మావటి మాట కూడా వినదు. కానీ ఓ ఏనుగు మాత్రం తన వావటి చనిపోతే కన్నీరు పెట్టుకుంది. దీని బట్టిచూస్తే ఆ మావటి అంటే దానికి ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు. కేరళలోని కొట్టాయం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన చూసినవారంతా కన్నీరు పెట్టుకున్నారు.

వణ్యప్రాణులను కొంచెం ప్రేమ చూపిస్తే అవి మనపై ఎంతటి విశ్వాసాన్ని చూపుతాయనడానికి తార్కాణమే కేరళలో తన మావటి చనిపోతే కన్నీరు పెట్టుకున్న ఏనుగు దృశ్యం. ఈ ఏనుగు పేరు పల్లట్టు బ్రహ్మదాథన్. ఆ మావటి పేరు కున్నక్కాడ్ దామోదరన్ నాయర్. ఆయన వయసు 74 ఏళ్లు. స్థానికులు ఆయన్ని గౌరవంగా ఒమనాచెట్టన్ అని పిలుచుకుంటారు. ఒమనాచెట్టన్ అంటూ అందరి బాగోగులు చూసే పెద్దన్న అని అర్థం. ఆయన పెద్ద మనస్సు వల్లనే ఆయనను అలా పిలుచుకుంటారు స్థానికులు.అందరిని ఎంతో ప్రేమతో పలుకరించేవారు. బాగోగులు తెలుసుకునేవారు. ఇక ఏనుగు పల్లట్టు బ్రహ్మదాథన్ అంటే ఆయనకు పంచ ప్రాణాలు.

ఈ క్రమంలో 74 ఏళ్ల మావటి కున్నక్కాడ్ దామోదరన్ నాయర్  జూన్ 3న మృతి చెందారు. ఆయన మరణాన్ని స్థానికులే కాదు ఏనుగు కూడా తట్టుకోలేకపోయింది. ఆ ఏనుగు గుండె చెరువైంది. ఎంతో భారంగా అడుగులు వేసుకుంటూ మావటి మృతదేహం వద్దకు వచ్చింది. కన్నీరు పెట్టుకుంది. దాన్ని మూగ బాధను అర్థం చేసుకున్నవారి మనస్సు కూడా ద్రవించిపోయింది. దామోదరన్ జీవించి ఉన్నప్పుడు ఏనుగుకు ఎన్నో విద్యలు చేర్పించారు. ఆయన నేర్పించినట్లుగానే ఆ ఏనుగు తన మావటికి కన్నీటితో తుది నివాళి అర్పించింది. కళ్లు నీళ్లు చెమర్చుతుండగా.. తొండం పైకెత్తి మృతదేహానికి దండం చేసింది. అది చూసి దామోదరన్ కుమారుడు రాజేశ్ ఆ ఏనుగు వద్దకు వచ్చి హత్తుకున్నాడు. దాని తొండంపై వాలి తన గుండెలోని భారాన్ని కొంత దించుకునే ప్రయత్నం చేశాడు. అలా కన్నబిడ్డ పెంచుకున్న బిడ్డలు ఒకరి బాధలు మరొకరు పంచుకున్నారు. కన్నీరు పెట్టుకున్నారు. ఒకరినొకరు ఓదార్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఆ ఏనుగు మావటి కుమారుడ్ని ప్రేమగా ఓదార్చినట్లు కనిపించింది. ఆ దృశ్యాలు అక్కడున్న వారి గుండెల్ని మరింత బరువెక్కించాయి. మావటిపై ఆ ఏనుగు కురిపిస్తున్న ప్రేమను చూసి వాళ్లు కూడా భోరుమని ఏడ్చారు. తన యజమానికి చివరిసారిగా ఘన నివాళి అర్పించి ఆ గజరాజం అక్కడ నుంచి మరింత భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ ఫేస్‌బుక్ యూజర్ షేర్ చేశారు. అది చూసినవారంతా కూడా కంట తడి పెట్టుకుంటున్నారు. ‘మూగ ప్రాణి వీడియో గుండెలను కదిలిస్తోంది. కుటుంబంలో ఓ సభ్యుడిని కోల్పోతే కన్నీరు పెట్టినట్టుగా ఆ ఏనుగు రోదిస్తోంది’.

ట్రెండింగ్ వార్తలు