ఏప్రిల్ 20 నుంచి లాక్ డౌన్ సడలింపు : కీలక ఆదేశాలు జారీ చేసిన కేరళ

  • Publish Date - April 18, 2020 / 12:04 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్ డౌన్ ను ఏప్రిల్ 20 సోమవారం నుంచి కేంద్ర  ప్రభుత్వం పాక్షికంగా సడలించనున్న నేపధ్యంలో కేరళ ప్రభుత్వం కీలకవ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో కరోనా తీవ్రతను బట్టి రెడ్‌, ఆరెంజ్ ఏ, ఆరెంజ్‌ బీ, గ్రీన్‌ జోన్లుగా విభజించింది. వాటి ఆధారంగా సంబంధిత జిల్లాల్లో పాటించాల్సిన నియమ నిబంధనలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. 

కాసర్‌గడ్‌, కన్నూరు, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాలను రెడ్‌ జోన్‌ కింద పరిగణిస్తూ… ఆయా చోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలు యథాతథంగా అమలవుతాయని చెప్పింది. ఈ నాలుగు జిల్లాల్లో ఎటువంటి రంగాలకు కూడా నిబంధనల నుంచి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. హాట్‌స్పాట్లను సీల్‌ చేసి ఉంచుతామని.. కేవలం నిత్యావసర వస్తువుల కోసం మాత్రమే రెండు మార్గాలు తెరచి ఉంచుతామని పేర్కొంది.

ఇక మిగతా జిల్లాల్లో సరి- బేసి విధానం (అత్యవసర సేవలకు మాత్రమే)లో ప్రైవేటు వాహనాలను రోడ్ల మీదకు అనుమతిస్తామని  కేరళ ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా రెస్టారెంట్లను రాత్రి ఏడు గంటల వరకు నిర్వహించుకునేందుకు అనుమతినివ్వనున్నారు. స్వల్ప దూర ప్రయాణాల కోసం అంతర్‌ జిల్లాలో బస్సులు నడుపనున్నట్లు పేర్కొంది. అయితే ప్రతీ ఒక్కరు కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

కాగా పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలను ఆరెంజ్‌ ఏ జోన్‌లో చేర్చిన ప్రభుత్వం.. ఏప్రిల్‌ 24 నుంచి అక్కడ లాక్‌డౌన్‌ నిబంధనలను పాక్షికంగా సడలించనున్నట్లు తెలిపింది. 

ఇక ఆరెంజ్‌ బీ జోన్‌లోని అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్‌, వయనాడ్‌, త్రిసూర్‌ జిల్లాలో సోమవారం నుంచే నిబంధనలు సడలిస్తున్నట్లు వెల్లడించింది. కొట్టాయం, ఇడుక్కి జిల్లాలను గ్రీన్‌ జోన్‌ కిందకు తెచ్చిన విజయన్‌ సర్కారు…. సోమవారం నుంచి అక్కడ లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేయనన్నుటు పేర్కొంది.

Also Read | ప్లీజ్ ఇక్కడే ఉండండి : బీహార్ వలస కార్మికులపై రాష్ట్రాల చూపు

ఆరెంజ్‌ జోన్‌లో సడలింపులు ఇలా..

అత్యవసర సమయాల్లో బేసి సంఖ్య నంబరు ప్లేట్లు కలిగిన వాహనాల(ప్రైవేటు)కు సోమ, బుధ, శుక్ర వారాల్లో అనుమతి
సరి సంఖ్య నంబరు ప్లేట్లు కలిగిన వాహనాలకు మంగళ, గురు, శని వారాల్లో అనుమతి.. ఇక ఒక్కరే లేదా ఒ‍కరి తోడుతో ప్రయాణించే మహిళలకు ఈ నిబంధనలు వర్తించవు
డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్యాసింజర్లు మాత్రమే కార్లలో ప్రయాణించాలి. టూ వీలర్‌లో ఒక్కరే వెళ్లాలి.
మాస్కులు తప్పక ధరించాలి. శానిటైజర్లు వాడాలి. బస్సుల్లో ప్రయాణించే వారికి వీటిని అందుబాటులో ఉంచుతాం
శని, ఆదివారాల్లో బార్బర్‌ షాపులు తెరుస్తారు. ఏసీ వాడకూడదు. కేవలం ఇద్దరికి మాత్రమే ఒకేసారి క్షవరం చేయవచ్చు.
రాత్రి 7 గంటల వరకు రెస్టారెంట్ల నిర్వహణ
ఆరోగ్య సేవా సంస్థల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి
15 రోజులకొకసారి అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా లబ్దిదారుల ఇంటికే పౌష్టికాహార పంపిణీ 
నిబంధనలు పాటిస్తూ గ్రామీణ ఉపాధి పనుల కొనసాగింపు
దగ్గు, జ్వరం లేని వాళ్లు మాత్రమే పనిలోకి రావాలి. విధిగా కార్మికులకు చెకప్‌ చేయించాలి.

గ్రీన్‌ జోన్‌ పరిధిలో..

దేశీయ, అంతర్జాతీయ వైమానిక ప్రయాణాలు నిషిద్ధం
రైళ్ల రాకపోకలు బంద్‌
మెట్రో సర్వీసులు మూసివేత
సినిమా హాళ్లు, మాళ్లు, షాపింగ్‌ కాంప్లెక్సులు, స్విమ్మింగ్‌ పూల్స్‌ తదితర ప్రదేశాలు మూసి ఉంచాలి
బహిరంగ సమావేశాలు నిషిద్ధం
మతపరమైన స్థలాలు మూసివేత
పెళ్లిళ్లు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య 20 లోపు ఉండాలి. ఇందుకు అనుమతి తీసుకోవాలి