కేరళ నన్‌ మరియంకు వాటికన్ సిటీలో అరుదైన గౌరవం

భారత్‌కు చెందిన నన్ మరియం థ్రెసియాను పోప్ ఫ్రాన్సిస్ పునీతగా ప్రకటించారు. ఆదివారం కేరళలో జరిగిన కార్యక్రమంలో థ్రెసియాతో పాటూ మరో నలుగురిని కూడా పునీతులుగా ఆయన ప్రకటించారు. కేరళలో అపారభక్తి విశ్వాసాలున్న క్రైస్తవ కుటుంబంలో జన్మించిన థ్రెసియా చిన్నతనం నుంచి నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిస్వార్థమైన సేవలు అందించేవారు. అనాథలను పలకరించి మనో ధైర్యాన్ని నింపేవారు. 

మేరీ థ్రెసియా 1876వ సంవత్సరం ఏప్రిల్ 26న కేరళలోని థ్రిస్సూర్ జిల్లాలో జన్మించారు. 50సంవత్సరాల వయస్సున్నప్పుడు 1926 జూన్ 8న లోకాన్ని విడిచారు. ఆదివారం థ్రెసియాతో పాటు పునీతులుగా ప్రకటితులైన వారిలో జాన్ హెన్నీ న్యూమన్  (బ్రిటన్), మార్గరైట్ బేస్ (స్విట్జర్లాండ్), డుల్సీ లోపెస్ (బ్రెజిల్), గ్యూసెప్పీనా వన్నినీ (ఇటలీ) ఉన్నారు. 

ఈ సందర్భంగా ఆదివారం వాటికన్ సిటీలో కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. కాథలిక్ చర్చిలు చాలా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. మరియమ్ చనిపోయిన 93 సంవత్సరాల తర్వాత ఈ హోదా దక్కినప్పటికీ పండుగ వాతావరణంతో వేడుకలు జరిగాయి. భారత్ తరఫున హాజరైన ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ కెప్టెన్సీవహించారు. 

మరియం థ్రెసియా సేవలను సెప్టెంబరు 29న ప్రసారమైన మన్  కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ సైతం ప్రస్తావించారు. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితం గురించి ప్రశంసలు కురిపించారు. ఎన్నో పాఠశాలలు, వసతి గృహాలు, శరణాలయాలను నిర్మించారని కొనియాడారు.