కేరళలోని త్రిస్సూర్ పూరమ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో కేరళలోనే అతిపెద్దదైన గజరాజుపైనున్న నిషేధాన్ని తొలగించారు. దీంతో 54ఏళ్ల ఏనుగు తెచికొట్టుకవు రామచంద్రన్ ఉత్సవాల్లో పాల్గొన్నది. పదిన్నర అడుగుల ఎత్తుంటే ఈ ఏనుగుపై స్వామివారి విగ్రహాన్ని ఊరేగించారు. మరోవైపు గజరాజును చూసేందుకు జనం భారీగా ఎగబడ్డారు. గజరాజులు కొలువుదీరి కనువిందు చేసే ఏకైన ప్రదేశం కేరళలోని త్రిస్సూర్ అని చెబితే అతిశయోక్తి కాదు. త్రిస్సూర్ పూరం ఫెస్టివల్‌లో గజరాజుదే ప్రధానాకర్షణ. పూరమ్ ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఘట్టం స్వామివారిని అంబారీపై ఊరేగించడం. ఇందుకోసం తెచికొట్టుకవు రామచంద్రన్ అనే ఏనుగుపైనున్న నిషేధాన్ని ఎత్తివేశారు. పురాతన వడకుంనాథన్ ఆలయ దక్షిణ ద్వారాలను ఈ ఏనుగు తెరవడంతో పూరమ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.
పదిన్నర అడుగుల ఎత్తు ఉండే ఏనుగు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ గృహ ప్రవేశం సందర్భంగా ఇద్దరు వ్యక్తులను తొక్కి చంపేసింది. అంతకుముందు మరో ఏడుగురిని చంపేసింది. దీంతో జిల్లా అధికారులు ఈ ఏనుగును ఆలయ ఉత్సవాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. గజరాజుపై నిషేధం విధించడంతో ఎలిఫెంట్ అసోసియేషన్ వారు ఆలయ ఉత్సవాల్లో ఏ ఏనుగూ పాల్గొనరాదంటూ హుకుం జారీ చేశారు. అసలే.. కేరళ.. గజరాజు లేనిదే ఆలయ ఉత్సవాలు జరగవు. పూరమ్ ఉత్సవాలకు ఏనుగులను సప్లై చేయలేమని అసోసియేషన్ తెగేసి చెప్పడంతో అధికార యంత్రాంగం దిగొచ్చింది. రామచంద్రన్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది.
గజరాజుకు వెటర్నరీ డాక్టర్లు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి పూర్తిగా ఫిట్‌గా ఉందని తెలిసిన తర్వాతే పూరం ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. ఇందుకు కొన్ని నిబంధనలు పెట్టారు. రామచంద్రన్ తిరిగే సమయంలో ప్రజలు దీనికి దూరంగా ఉండి వీక్షించాలని.. ఉత్సవాల్లో ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకే అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది. గజరాజు వెళ్లే మార్గంలో ప్రజలు దగ్గరకు రాకుండా బారికేడ్లు ఉంచాలని, అదే సమయంలో నలుగురు మావటి వాళ్లు దీనికి ఎస్కార్ట్‌గా వెళ్లాలని సూచించింది. మొత్తానికి రామచంద్రన్ రాకతో ఉత్సవాలకు ఇంతకుముందటి కల వచ్చింది.
త్రిస్సూర్ పూరమ్ ఉత్సవాల్లో పాల్గొనే రామచంద్రన్‌కు కేరళలో అభిమానులు భారీగా ఉన్నారు. ఒకరకంగా ఈ ఏనుగు ఓ సెలబ్రిటీయే. కొన్ని రోజులు ఇది కనిపించకపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు పూరమ్ ఉత్సవాల్లో మళ్లీ కనిపించడంతో రామచంద్రన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. త్రిస్సూర్ పూరమ్ ఉత్సవాల్లో మే 13వ తేదీ సోమవారం క్రాకర్ల ప్రదర్శన జరుగనుంది. 50 ఏనుగులు ఇందులో పాల్గొననున్నాయి. మధ్యాహ్నం జరుగుతుంది. మే 14వ తేదీ మంగళవారం ఉదయం వరకు కొనసాగుతుంది.