ద కింగ్ ఆఫ్ కంబాల: 45 మెడల్స్ తో ఇండియన్ బోల్డ్ శ్రీనివాస్ గౌడ ఆల్ టైం రికార్డ్

  • Publish Date - March 10, 2020 / 08:08 AM IST

కర్నాటకలో ఆదివారం ముగిసిన దున్నల పరుగుపందాల్లో కంబాల జాకీ, శ్రీనివాస గౌడ, ఏకంగా 15 ఈవెంట్లలో 46 మెడల్స్ గెలిచాడు.  చివరిదైన జోడుకర కంబలా రేసు (జోడి దున్నల పరుగు)లో నాలుగు మెడల్స్ కొట్టేశాడు. మూడు గోల్డ్, ఒక రజితంలో మొత్తం ఈ సీజన్ లో పతకాల సంఖ్యను బాగా పెంచుకున్నాడు.  మొత్తం 35 గోల్డ్ లు, 11 రజితాలతో చరిత్రనే సృష్టించాడు. ఇప్పటిదాకా కంబాలలో ఎక్కువ మెడల్స్ గెల్చిన రికార్డు హుక్కేరి షెట్టి పేరుమీదుగా ఉంది. ఆయన మొత్తం 17 కంబలా రేసుల్లో 32 మెడల్స్ గెల్చాడు. అదీ మూడేళ్ల క్రితం.

142.5 మీటర్ల కంబాల ట్రాక్‌ను 13.62 సెకండ్లతో గెలవడంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. అంటే వంద మీటర్లను 9.55 సెకండ్లలో చేరినట్లు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఉసేన్ బోల్డ్‌ది. అదేరోజు మరో ఈవెంట్ లో వందమీటర్ల దూరాన్ని 9.44 సెకండ్లలో పరిగెత్తాడు. ఇండియా మొత్తం ఈ కంబాల జాకీని ఉసెన్ బోల్డ్ పోల్చి ఊగిపోయింది. ఆ తర్వాత ఈ రికార్డు బద్దలైంది. మరో జాకి నిషాంత్ షెట్టి ఏకంగా 9.15 సెకండ్లలో వందమీటర్లను పూర్తిచేసి ఔరా అనిపించాడు.

ఈసారి కంబాలలో శ్రీనివాస గౌడే ప్రత్యేక ఆకర్షణ. మొత్తం 46 మెడల్స్ అంటే, ఇప్పట్లో గౌడను కొట్టేవాళ్లు రాకపోవచ్చు. కంబాల కమిటీకి స్టార్ క్యాంపైనర్ దొరికినట్లే.  ఈసీజన్‌లో కొత్త వాటికి అవకాశమిచ్చారు. పక్కా టైమింగ్ కోసం లేజర్ టైమింగ్‌ను వాడారు. అందుకే శ్రీనివాసగౌడ టైమింగ్ ఇంత పాపులర్ అయ్యింది.  

See Also | 19 ఏళ్లపాటు శారీరకంగా వాడుకున్నాడు….ఇప్పుడు వేరొకరితో వివాహం