Shivaji Jayanti 2025: ఛత్రపతి శివాజీ మహారాజ్.. ఆయన జీవితం ఎంత గొప్పదో తెలుసా? పేరు తలుచుకుంటే చాలు..

ఆయన గొప్ప చరిత్రను తెలుసుకోవాల్సిందే..

ఛత్రపతి శివాజీ మహారాజ్.. శత్రువులకు సింహస్వప్నం.. నమ్ముకున్న వారిని కాపాడుకోవడం కోసం ఎంతటికైనా వెనకాడని ధైర్యం ఆయన సొంతం. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే కాదు.. ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప సంచలనం ఆయన చరిత్ర.

ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి, మొఘలుల ఆధిపత్యానికి చెక్‌ పెట్టారు. సొంత ప్రజల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానాయకుడు ఆయన. శివాజీ జీవితానికి అతని తల్లి జీజాబాయి గొప్ప ప్రేరణగా నిలిచారు.

బాల్యం నుంచే శివాజీకి ధైర్యం, సాహసం, రాజధర్మం నూరిపోశారామె. శివాజీని తల్లి ఓ గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దారు. ప్రజలను పరిపాలించేందుకు, వారి హక్కులను కాపాడేందుకు, శత్రువుల పాలన నుంచి విముక్తి కలిగించేందుకు శివాజీ నిరంతరం శ్రమించారు.

మొఘలుల దురాక్రమణలకు వ్యతిరేకంగా పోరాడారు. వారికి ఎదురులేని ధీశాలి అని నిరూపించుకున్నాడు. తన పాలనలో ప్రజలకు న్యాయం పొందేలా, హిందూ సంస్కృతిని కాపాడేలా చర్యలు తీసుకున్నారు. యుద్ధ సమయంలో కూడా ఆయన ఔదార్యం ప్రదర్శించి, శత్రువులందరికీ గౌరవం కలిగించేలా వ్యవహరించారు.

Also Read: అక్కడ 4,580 టన్నుల బంగారం ఇప్పుడు ఉందా? లేదా? ఎలాన్‌ మస్క్‌ ఫస్ట్ రియాక్షన్‌ వచ్చేసింది.. మొత్తం పోయిందా?

శివాజీ స్థాపించిన స్వతంత్ర సామ్రాజ్యం ఆలోచనా విధానాన్ని, పరిపాలనా తీరును చూపించే అద్భుతమైన ఘట్టం. ఆయన జీవిత కథ అనేక భావోద్వేగాలతో నిండి ఉంటుంది. శివాజీ జీవితం, పోరాటం, ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడికి గర్వకారణం.

శివాజీకి ఆయన తల్లి బాల్యం నుంచే రామాయణం, మహాభారతం వంటి పౌరాణిక గాథలను చెప్పారు. ధర్మపాలన, పరాక్రమం, ప్రజా సేవ విలువలను బోధించారు.

శివాజీ తండ్రి షాహాజీ బోంస్లే, చిన్నతనంలో శివాజీని మరాఠా సామ్రాజ్య స్వాతంత్య్రానికి నడిపించేందుకు ప్రేరేపించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌తో శివాజీ పోరాడారు. శివాజీని ఓ సారి పిలిచి ఆగ్రాలో బంధించారు. అయినప్పటికీ, శివాజీ తన చాతుర్యంతో భద్రతా సిబ్బందిని ఏమార్చి ఓ బుట్టలలో దాక్కొని తప్పించుకున్నారు.

శివాజీ చాలా ధైర్యసాహసాలతో పోరాడిన యోధుడు. ఆయన యుద్ధాల్లో బందీగా పట్టుకున్న శత్రు సైనికులను, ముఖ్యంగా మహిళలను గౌరవంతో విడిచిపెట్టేవారు. ఆయన తన సైనికులకు స్త్రీలను ఎప్పుడూ అవమానించకూడదని చెప్పేవారు. శివాజీ తన ప్రజలను ఎప్పుడూ ఆదరించేవారు. ప్రజలకు అన్యాయం జరగకుండా కాపాడేందుకు ఆయన ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవారు.