onions of lorry goes missing : రూ.16 లక్షల విలువైన ఉల్లిగడ్డల లోడుతో బయల్దేరిన లారీ అదృశ్యమైంది. డ్రైవర్ ఆచూకీ కూడా లేదు. ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయడం లేదని బోరుమన్నాడు. ఉల్లిగడ్డల లోడ్, లారీ అదృశ్యం కావడంతో ఎర్నాకులం మార్కెటుకు చెందిన ఆన్‌లైన్ హోల్ సేలర్ మర్చెంట్ అలీ మహమ్మద్ సయ్యద్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
గత 20 ఏళ్లుగా ఉల్లిగడ్డల రవాణా చేస్తున్న సయ్యద్.. లక్షల విలువైన 25 టన్నుల ఉల్లిగడ్డల లారీ లోడ్ మిస్ అయినప్పటి నుంచి నిద్రలేని రాత్రులను గడుపుతున్నాడు. ఉల్లిగడ్డల లారీ లోడ్ కోచి చేరుకోవాల్సి ఉంది. లారీ డ్రైవర్ ఆచూకీ కోసం ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన రింగ్ అవుతున్నప్పటికీ డ్రైవర్ కాల్ ఎత్తడం లేదు.
అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని సయ్యద్ తెలిపాడు. మహారాష్ట్రలోని తన అమ్మకందారుడు సంజయ్ కుమార్ అనే వ్యక్తి కార్గో లోడ్ పంపాడని చెప్పాడు. కొన్ని రోజుల క్రితం 25 టన్నుల ఉల్లిగడ్డల లోడ్ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి బయల్దేరినట్టు పోలీసులతో చెప్పాడు.
ఉల్లిగడ్డల లోడ్ విలువ రూ.16 లక్షల వరకు ఉంటుందని చెప్పారడు. తన షాపుకు లోడ్ డెలివరీ అయిన నాలుగు రోజుల తర్వాత మొత్తం డబ్బులు చెల్లించాల్సి ఉందని వాపోయాడు.
తనకు డ్రైవర్ పైనే అనుమానం ఉందని, అతడు కావాలనే మరో మార్గానికి లారీ డైవర్ట్ చేశాడనే అనుమానంగా ఉందని సయ్యద్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సయ్యద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదృశ్యమైన లారీ, డ్రైవర్ కోసం సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.