Lakhimpur Kheri Case: నాలుగు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన మంత్రి కొడుకు

లఖింపూర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా అలియాస్ టెనీ కొడుకు ఆశిష్ మిశ్రా జైలు నుంచి బయటకు వచ్చాడు.

Lakhimpur Kheri Case: లఖింపూర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా అలియాస్ టెనీ కొడుకు ఆశిష్ మిశ్రా జైలు నుంచి బయటకు వచ్చాడు. నాలుగు నెలల క్రితం అరెస్ట్ అయిన ఆశిష్‌‌కి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ గతవారం బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికోనియా గ్రామంలో నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిష్ జీపును నడిపినట్లుగా ఆరోపణలు వచ్చాయి.

బెయిల్‌కు షరతులు..
ఆశిష్ మిశ్రా లాయర్ అవధేష్ సింగ్ బెయిల్ షరతుల గురించి సమాచారం ఇచ్చారు. సాక్షులపై ఒత్తిడి చేయకూడదని, సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదనే షరతులతో బెయిల్ ఇచ్చినట్లు చెప్పారు. ఆశిష్ మిశ్రా జైలు నుంచి టికునియా ఇంటికి వెళ్లారు.

రైతులను వాహనంతో చితకబాదిన ఘటన అంతా పక్కా ప్రణాళికతో జరిగిన కుట్రేనని, దీనిపై విచారణ జరుపుతున్న సిట్ విచారణలో వెల్లడైంది. ఈ కేసు విషయంలో సిట్ 5వేల పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, అందులో ఆశిష్ మిశ్రా రైతులను హత్య చేసిన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 16 మందిని సిట్‌ నిందితులుగా చేర్చింది. నిందితులపై సిట్ ఐపీసీ సెక్షన్లు 307, 326, 302, 34,120బి, 147, 148,149, 3/25/30 అభియోగాలు నమోదు చేసింది.

ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు..
ఆశిష్ మిశ్రా బెయిల్ దరఖాస్తును స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఫిబ్రవరి 10న అతనికి బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది. అయితే, కోర్టు ఆర్డర్‌లో ప్రస్తావన సమయంలో కొన్ని సెక్షన్‌లు విస్మరించడంతో ఆశిష్ విడుదల నిలిచిపోయింది.

ట్రెండింగ్ వార్తలు