Lalu gets bail: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరైంది. మరికొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో శుక్రవారం(అక్టోబర్-9,2020) లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రూ. 50,000 విలువైన రెండు వ్యక్తిగత బాండ్లు సమర్పించాలని లాలూను కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా బెయిల్ పొందేందుకు సీబీఐ స్పెషల్ కోర్టు విధించిన 2లక్షల రూపాయల పెనాల్టీని డిపాజిట్ చేయాలని జార్ఖండ్ హైకోర్టు లాలూని ఆదేశించింది.
కాగా,దాణా కుంభకోణం కేసులో లాలూకు ప్రస్తుతం బెయిల్ మంజూరైనా జైలు నుంచి ఆయన బయటకు వచ్చే అవకాశం మాత్రం లేదు. లాలూపై దుమ్కా ఖజానా కేసు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బెయిల్ మంజూరైనా ఆయన జైలు నుంచి విడులయ్యే అవకాశం లేదు.
మరోవైపు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అక్టోబర్-28న తొలివిడత పోలింగ్, నవంబర్-3న రెండో విడత, నవంబర్-7న మూడో విడత పోలింగ్‌ను నిర్వహించి.. నవంబర్ 10న ఫలితాలను వెల్లడించనున్నట్లు సీఈసీ వెల్లడించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 29తో ముగియనుంది.