Lalu Prasad - Rahul Gandhi
Lalu Prasad Yadav – Rahul Gandhi : విపక్ష పార్టీలు బిహార్ (Bihar) రాజధాని పాట్నాలో నిర్వహించిన సమావేశంలో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. విపక్ష నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెళ్లి అంశాన్ని ఆర్జేడీ (RJD) అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తావించారు.
” పెళ్లి చేసుకోండి.. మా మాట వినండి.. మేమందరం మీ బరాత్‌లో పాల్గొంటాం ” అని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. అలాగే, రాహుల్ గాంధీ గడ్డం కూడా తీసేయాలని నవ్వుతూ అన్నారు. దీంతో రాహుల్ గాంధీ స్పందించారు. ” మీరు చెప్పిన విషయాలను నేను తప్పకుండా పాటిస్తాను ” అని చెప్పారు.
కాగా, భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ గడ్డం పెంచుకున్నారు. ఆ తర్వాత తీసేశారు. ఇప్పుడు మళ్లీ రాహుల్ గడ్డం పెరిగింది. ఆయనకు 53 ఏళ్లు. రాహుల్ గాంధీ పెళ్లి గురించి ఆయనను చాలా మంది అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
విపక్ష పార్టీల సమావేశంలో బీజేపీపై పలువురు నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ పునాదులపై బీజేపీ దాడి చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ దాడులను ఐక్యంగా ఎదుర్కొంటామని తెలిపారు.