‘మహా’ ఖాకీలపై కరోనా కోరలు : 24 గంటల్లో 190మంది పోలీసులకు పాజిటివ్

  • Publish Date - June 26, 2020 / 10:43 AM IST

మహారాష్ట్ర పోలీసులపై కరోనా క్రౌర్యం చూపిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 190 మంది పోలీసులకు కరోనా సోకిందని..ఇద్దరు మరణించారని మహారాష్ట్ర పోలీస్‌ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు 4516 మంది పోలీసులు కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారని, మొత్తం 56 మంది మరణించారని తెలిపింది. కరోనా బారినపడిన 3444 మంది పోలీసులు కోలుకున్నారని వెల్లడించింది. 

ముంబై పోలీసులు కరోనా బారినపడుతుండటం ఎక్కువగా అవుతుండటంతో నగరంలో కోలే కల్యాణ్‌, మరోల్‌, మెరైన్‌ డ్రైవ్‌ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మూడు క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేసామని పోలీస్‌ పీఆర్వీవో ప్రణయ్‌ అశోక్‌ తెలిపారు.  ఈ మూడు కేంద్రాల్లో కలిపి మొత్తం వెయ్యి పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాగా కరోనా సోకి ముంబైలో ఇప్పటికే 37 మంది పోలీసులు మరణించారు. 

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,47,741 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 63,357 యాక్టివ్‌ కేసులు ఉండగా, 77,453 మంది కోలుకున్నారు. ఈ వైరస్‌బారిన పడినవారిలో ఇప్పటివరకు 6931 మంది మరణించారు.

Read: పంజాబ్ వ్యాపారి ఇంట్లో రక్తపుటేరులు..ఐదు దారుణ హత్యలు..!!